Earthquake in Maharashtra : మహారాష్ట్రలో మరోసారి భూమి కంపించింది. హింగోలీలో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. ఆదివారం తెల్లవారు జామున 12.41 గంటలకు చోటుచేసుకుంది. ఈ భూకంపం వల్ల భయపడాల్సింది లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కాగా, వరుస భూకంపాలతో మహారాష్ట్రవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలావుంటే, గత మంగళవారం మహారాష్ట్రలోని పూణె జిల్లాలో 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు జనవరి 28న తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.8గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం పశ్చిమ ఢిల్లీకి 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీనికిముందు జనవరి 13న నోయిడాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.9గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా డిసెంబరు 25న స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే, స్వల్ప భూకంపాల వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎవరూ భయాందోళనకు గురికావల్సిందేమిలేదన్నారు. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.