పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘తౌక్తే’ తుపాను బలహీనపడిన తరుణంలో… తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను రెడీగా ఉందంటున్న భారత వాతావరణ విభాగం(IMD ) తెలిపింది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారవచ్చని IMD అంచనా వేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుందని తెలిపింది. ఆపై దిశ మార్చుకుని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా వెళ్తుందని ప్రకటించింది.
పశ్చిమబెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల సమీపానికి వచ్చేసరికి రూట్ మార్చుకునే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలానే జరిగితే పెద్ద ముప్పు నుంచి ఆంధ్రప్రదేశ్ భయటపడినట్లే…కానీ ఈ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల తర్వాత మోస్తరు వర్షాలు పడుతాయని అన్నారు. ఇక ఈనెల 23న అల్పపీడనం ఏర్పడినా, బలపడి తుపానుగా మారినా నైరుతి రుతువపనాల ఆగమనానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.