Tamil Nadu: కావేరికి పోటెత్తిన వరద.. జలపాతాలు మూసివేత.. నిండుకుండలా మెట్టూరు డ్యాం

కావేరి (Kaveri River) నదికి వరద పోటెత్తుతోంది. కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో నది పరిమితిని మించి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డెల్టా ప్రాంతాలకు...

Tamil Nadu: కావేరికి పోటెత్తిన వరద.. జలపాతాలు మూసివేత.. నిండుకుండలా మెట్టూరు డ్యాం
Kaveri Floods

Updated on: Aug 04, 2022 | 12:05 PM

కావేరి (Kaveri River) నదికి వరద పోటెత్తుతోంది. కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో నది పరిమితిని మించి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డెల్టా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కేరళలో (Kerala) కురుస్తున్న వర్షాలకు తమిళనాడు సరిహద్దు జిల్లాలు కన్యాకుమారి, తేని లోని జలపాతాలను అధికారులు మూసివేశారు. మధురై వైగై డాం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడం తో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సేలంలోని మెట్టూరు డ్యాం కు ఒక లక్షా 75 వేల క్యూసెక్కులు వరద వస్తోంది. తిరుచ్చి, తంజావూర్, నాగపట్నం , మైలాడుతురై తో సహా కావేరీ నది పరివాహక జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కావేరీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దండోరా వేయించారు.

కాగా.. విస్తారంగా కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. కావేరి నదిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలనీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మెట్టూరు డ్యాంకు నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. డ్యాం నుంచి ఇప్పటికే సాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. హొగెనక్కల్ జలపాతాన్ని అధికారులు మూసేశారు. కెఆర్ఎస్ , కబిని డ్యాం నుంచి లక్ష 15 వేల కుసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం తో తమిళనాడు కు వరద ముప్పు పొంచి ఉంది. కావేరీ వరద ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి, వివరాలు అందించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి