డ్రగ్స్ రవాణాకు మరో కొత్త ఎత్తుగడ.. అధికారుల తనిఖీల్లో వేల కోట్ల విలువైన మత్తు పదార్థాలు లభ్యం..
పట్టుబడిన డ్రగ్స్ విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
దేశంలో ఎక్కడో ఒక చోట నిషేధిత డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. డ్రగ్స్ విక్రయించే వారిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నప్పటికీ కొత్తగా డ్రగ్స్ డీలర్లు పుట్టుకొస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి, అక్రమ మార్గాల్లో డ్రగ్స్ దందా యద్ధేచ్చగా సాగిస్తున్నారు. ఇందుకోసం రోజుకో కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తుంటే, మరికొందరు పండ్లు, కూరగాయల మాటున గుట్టుగా తరలిస్తున్నారు. తాజాగా.. ముంబై ఎయిర్‌పోర్టులో నిషేధిత మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.4.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
నవీ ముంబైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శనివారం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నది. వాషిలో దిగుమతి చేసుకున్న నారింజ పండ్లను తీసుకెళ్తున్న ట్రక్కులో తనిఖీలు నిర్వహించిన అధికారులు అందులో ఉన్న డ్రగ్స్ చూసి కంగుతిన్నారు. నారింజ పండ్లమాటున ఏకంగా198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫేటమిన్ (ice)తో పాటు తొమ్మిది కిలోల హై ప్యూరిటీ కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ఖరీదు దాదాపు రూ.1476 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి.
డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వాలెన్సియా నారింజ పండ్లను తరలించే బాక్సుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దాచి రవాణా చేస్తుండగా పక్కాగా అందిన సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై బ్రాంచ్ సెప్టెంబర్ 24న ముఠా నుంచి అక్రమ మార్కెట్‌లో రూ.2,435 కోట్ల విలువైన మొత్తం 1,218 కిలోల మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల తర్వాత విమానాశ్రయంలో ఓ విదేశీయుడి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.13 కోట్ల విలువైన కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రకమైన కొకైన్ భారతదేశంలో పట్టుకోవడం ఇదే మొదటిసారి. ఎందుకంటే స్కానింగ్ సమయంలో బ్లాక్ కొకైన్ కనిపించదు. స్నిఫర్ డాగ్‌లు కూడా దానిని గుర్తించలేవు.
గత నెలలో కూడా ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ నాలాసోపరా ప్రాంతంలో సుమారు 1400 కోట్ల రూపాయల విలువైన 703 కిలోల ఎండి డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఐదుగురిని అరెస్టు చేశారు. నగరంలో మాదకద్రవ్యాల వ్యాప్తిపై చర్యలు తీసుకోవడమే తన ప్రధాన కర్తవ్యమని ముంబై పోలీసు కమిషనర్ పునరుద్ఘాటించారు. కానీ, డ్రగ్స్ అక్రమ రవాణాలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..