Manipur: మత్తు నుంచి యువతను ప్రభుత్వాలు చాలా గట్టిక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. పెడ్లర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమార్కుల తాట తీస్తున్నారు. అయినా కానీ.. డ్రగ్ పెడ్లర్స్ తగ్గేదే లే అంటున్నారు. జైల్లో పెట్టినా.. మా దందా వదలం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. జైలుకి వెళ్లి వచ్చినా సరే.. మళ్లీ డ్రగ్స్‌తో గబ్బు వ్యాపారం చేస్తునే ఉన్నారు. రకరకాల డ్రగ్స్ దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ.. యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్నారు కేటుగాళ్లు. ఇందు కోసం చాలా క్రియేటివ్ ఐడియాలు వాడుతున్నారు. పోలీసులకు, ఇంటిలిజెన్స్‌కు, నార్కోటిక్ బ్యూరో అధికారులకు చిక్కకుండా ఉండేందుకు.. కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. తాజాగా సబ్బు పెట్టెల్లో హెరాయిన్ తరలించేందుకు యత్నించిన నిందితులను మణిపుర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.13 కిలోలు విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్ చేశారు. మొత్తం 212 సబ్బు పెట్టెల్లో నిందితులు వీటిని తరలించేందుకు ట్రై చేశారని.. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.31.80 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు.. చురచాంద్పుర్ జిల్లాకు చెందిన సోన్లైసీ హాకిప్, జామ్గౌలెన్ హాకిప్లుగా గుర్తించారు. వీరికి సహకరించిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు లోపలేశారు.
ఢిల్లీలో కూడా…
ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో కూడా డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఎయిర్ కార్గో నుంచి 55 కిలోలను సీజ్ చేసిన అధికారులు నిందితుడి అరెస్ట్ చేశారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు చేసిన అధికారులు మరో 7కిలోలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.434 కోట్లు అని తెలిపారు. ఈ డ్రగ్స్..ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి దుబాయ్ మీదుగా వీటిని ఇండియాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.