మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లోని దమోహ్నకలో శుక్రవారం మధ్యాహ్నం సిటీ బస్సు రెడ్‌లైట్ వద్ద నిలబడి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. డ్రైవర్ గుండెపోటుతో సీటులోనే వాలిపోవడంతో బస్సు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి విజయ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో మెట్రో బస్సు అధర్తాల్ నుండి ప్రయాణికులతో దమోహ్నక వైపు వస్తోంది. దమోహ్నక వద్ద సిగ్నల్ వద్ద ఆగిన వాహనాలపైకి సిటీ బస్సు ఒకటి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగిన ద్విచక్ర వాహనదారులు, ఒక ఆటో రిక్షాతో పాటు కారును ఢీ కొట్టిందన్నారు. ద్విచక్రవాహనాలను ఈడ్చుకుంటూ కొద్దిదూరం వెళ్లిన తర్వాత బస్సు ఆగిపోయింది. బస్సు వేగం తక్కువగా ఉండడం, ఢీ కొట్టినప్పుడు పక్కకు పడడంతో ఆరుగురు వాహనదారులు గాయాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండెపోటుకు గురైన బస్సు డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడని పోలీసులు వివరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ దేవ్ పటేల్ అనే వ్యక్తి జబల్ పూర్ లో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడి మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి