చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది డిజిటల్ లోన్ సేవలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సేవల ద్వారా చిన్న, వీధి వ్యాపారులు కూడా పెద్ద బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంటుందన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఫెస్టివల్‌లో ప్రసంగించిన కేంద్రమంత్రి వైష్ణవ్.. యూపీఐ సర్వీస్ లాగే దీన్ని కూడా ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌లో ఇది ఒక పెద్ద విజయం అని పేర్కొన్నారాయన.
‘ఈ ఏడాది డిజిటల్ లోన్ సర్వీసును ప్రారంభిస్తాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రాబోయే 10-12 సంవత్సరాలలో దీనిని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తుంది.’ అని చెప్పారు కేంద్ర మంత్రి వైష్ణవ్. కాగా, గురువారం నాడు కేంద్ర మంత్రి యూపీఐ కోసం వాయిస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ నమూనాను ఆవిష్కరించారు.
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. యూపీఐ గ్లోబల్ పేమెంట్ ప్రొడక్ట్‌గా మారనుందని, ఇందుకోసం నేపాల్, సింగపూర్, భూటాన్ వంటి దేశాలతో ఎన్‌పీసీఐ ఇప్పటికే భాగస్వామ్యాన్ని ప్రారంభించిందని తెలిపారు.
ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యుఎఇ, యుకె, యుఎస్‌ఎలోని 10 దేశాల ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) యుపిఐ సేవలు అందుబాటులో ఉంటాయని అల్కేష్ శర్మ చెప్పారు. 2023లో డిజిటల్ క్రెడిట్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. NPCI ఈ దిశలో ముందుకు సాగుతుందన్నారు. UPI 123 Payని స్థానిక భాషలో అందుబాటులోకి తీసుకురావడానికి మిషన్ భాషిణి – జాతీయ భాషా అనువాద మిషన్, డిజిటల్ పేమెంట్స్ కలిసి వచ్చాయని ఆయన తెలిపారు. ఇది ఒక సామాన్యుడు తన స్థానిక భాషా ఇంటర్‌ఫేస్‌లో వాయిస్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు.
సహజ భాష సాఫ్ట్‌వేర్ ‘భాషిణి’, UPI అనుసంధానించడం జరిగింది. దేశంలోని 18 భాషల్లో మాట్లాడటం ద్వారా ఎవరైనా చెల్లింపులు జరుపవచ్చు. డిజిటల్ క్రెడిట్‌లో ఇది గొప్ప విజయం. దీని ద్వారా ఫుట్‌పాత్‌పై పనిచేసే వ్యక్తిని బ్యాంకుతో అనుసంధానం చేయడం సులభం అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..