మీ ఎమ్మెల్యే ఓటు.. రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటుంది.. చాలా పెద్ద కథే ఉందిగా..

మీరు ఓటేసే ఎమ్మెల్యే కేవలం రాష్ట్రంలో చట్టాలు చేయడమే కాదు.. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషిస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ ఎలా నిర్ణయిస్తారు? రాష్ట్రాల వారీగా ఎందుకు మారుతుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ఏం చెబుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి.

మీ ఎమ్మెల్యే ఓటు.. రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటుంది.. చాలా పెద్ద కథే ఉందిగా..
Mla Vote For President Of India

Edited By:

Updated on: Oct 05, 2026 | 11:20 AM

మనలో చాలామంది ఎమ్మెల్యేకు ఓటు వేసేటప్పుడు.. తమ నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుంటారు. అయితే మనం ఎన్నుకునే ఎమ్మెల్యేకు మరో కీలక బాధ్యత కూడా ఉంది. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ప్రతి ఎమ్మెల్యే సభ్యుడే.. అవును.. మీరు ఓటేసే ఎమ్మెల్యే కేవలం రాష్ట్రంలో చట్టాలు చేయడమే కాదు.. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషిస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ ఎలా నిర్ణయిస్తారు? రాష్ట్రాల వారీగా ఎందుకు మారుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు, లోక్‌సభ-రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

ఎమ్మెల్యే ఓటుకు ప్రత్యేక విలువ

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఓటు విలువ ఒకేలా ఉండదు. ఆయా రాష్ట్రాల జనాభా, అక్కడి శాసనసభలోని ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఓటు విలువను నిర్ణయిస్తారు.

ఉదాహరణకు, 2022 రాష్ట్రపతి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ 7 గా ఉంది. ఎంపీలందరి ఓటు విలువ మాత్రం సమానంగా ఉంటుంది.

ఈ విధానం వెనుక ఉద్దేశం.. దేశ జనాభా ప్రాతినిధ్యం, రాష్ట్రాల ప్రాతినిధ్యం మధ్య సమతుల్యతను కొనసాగించడం. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు విలువ లెక్కించేందుకు 1971 జనాభా లెక్కల గణాంకాలను రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఉపయోగిస్తున్నారు.

మీ ఎమ్మెల్యేకు రెండురకాల బాధ్యతలు

ఎమ్మెల్యే ప్రధానంగా తన రాష్ట్ర శాసనసభలో చట్టాల రూపకల్పన, బడ్జెట్ చర్చలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నిక వచ్చినప్పుడు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని ఎన్నుకునే ప్రక్రియలో కూడా పాల్గొంటారు.

అంటే.. మనం వేసే ఎమ్మెల్యే ఓటు ప్రభావం కేవలం మన నియోజకవర్గానికే పరిమితం కాదు. ప్రతి ఐదేళ్లకోసారి రాష్ట్రపతి ఎన్నిక జరిగే సమయంలో అది దేశ స్థాయిలోనూ ఒక భాగస్వామ్యంగా మారుతుంది.

రోడ్డు వేయించడానికి, డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి ఎన్నుకున్న ఎమ్మెల్యే.. ఒక దశలో రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియలోనూ మీ తరఫున ఓటు వేస్తారు. ఇదే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక ఎన్నికలకు ఉన్న మరో ఆసక్తికరమైన జాతీయ ప్రాధాన్యం..

Loading...
Unable to load recommendations.
Follow Us