ఢిల్లీ అల్లర్లలో ఆప్ మాజీ నేత తాహిర్ హుసేన్ హస్తం ఉందని నిరూపించడానికి ఆధారాలను ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఆప్ నుంచి తాహిర్ ను గతంలోనే సస్పెండ్ చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో గతనెలలో జరిగినఘర్షణలు, అల్లర్ల సందర్భంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్యకు సంబంధించి తాహిర్ హుసేన్ ను పోలీసులు ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ ఇఛ్చిన ఫిర్యాదుపై ఖాకీలు ఇతడ్ని నాడే అరెస్టు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా గత నెల 24, 25 తేదీల్లో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో తాహిర్ హుసేన్ తన మద్దతుదారులతో కలిసి అంకిత్ శర్మను హతమార్చాడు. ఆయన శరీరంపై 53 కత్తి పోట్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్ పేర్కొంది. తాహిర్ హుసేన్ తన భవనంపైనుంచి రాళ్లు, పెట్రోలు బాంబులతో ఆందోళనకారులపై దాడి జరిపిన దృశ్యాల తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా ఇతడి నివాసంలో పోలీసులు సోదాలు జరపగా.. పెద్దఎత్తున రాళ్లు, పెట్రోలు బాంబులను విసరడానికి ఉపయోగించే బాటిల్స్, యాసిడ్ పోచ్ లను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా-ఘర్షణలు, అల్లర్లతో ప్రమేయం ఉన్న తాహిర్ హుసేన్ సోదరుడు షా ఆలం కూడా ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.