
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ఎర్రకోటలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.
ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదాతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వివరాలతో పోస్టర్లను సిద్ధం చేశారు. ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదుల వివరాలు కూడా ఇందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, మెట్రో స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు.
పోస్టర్లలో ఉన్న ఉగ్రవాదుల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే 112 కంట్రోల్ రూమ్ లేదా ఢిల్లీ పోలీసులకు తెలియజేయాలని పోలీసు అధికారులు కోరారు. విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రివార్డు అందిస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
Most Wanted Terrorists
ఎర్రకోట వద్ద భారీ భద్రత
ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే వేడుకలకు సుమారు 24 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత నవంబర్ 10న జరిగిన కారు పేలుడు ఘటన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కావడంతో భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎర్రకోట పరిసరాల్లో సుమారు 15 వేల మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ఇప్పటికే ఎర్రకోట సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎర్రకోట లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో 1,000కుపైగా అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, జనసమూహాన్ని పర్యవేక్షించడం, రియల్‌టైమ్‌లో పరిస్థితులను అంచనా వేయడం వంటి అంశాల్లో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి.
మల్టీలేయర్ సెక్యూరిటీ
భద్రతా చర్యల్లో భాగంగా కఠిన తనిఖీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్వాట్ కమాండోలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో స్నైపర్లను మోహరించడంతో పాటు కీలక భవనాలపైకప్పులపై భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల తనిఖీలు, విస్తృత గస్తీ, నిరంతర నిఘాను ముమ్మరం చేశారు.
ఢిల్లీ వ్యాప్తంగా నిఘా నేత్రం..!
ఎర్రకోటతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, సున్నిత ప్రాంతాలు, బస్ టెర్మినళ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. వివిధ భద్రతా, నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆగస్టు 2 నుంచి 16 వరకు ఢిల్లీ పరిధిలో డ్రోన్లు, UAVలు, హాట్ ఎయిర్ బెలూన్ల వంటి వాయు వాహనాలపై నిషేధం విధించారు.
ప్రస్తుత భద్రతా ముప్పులు, నిఘా వర్గాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
See something unusual?
Don’t ignore the signs.
Don’t touch.
Don’t move.
Don’t tamper.📞 Dial 112 & report immediately.
Your alertness today can prevent danger tomorrow.@LtGovDelhi#DPUpdates#SeeHearReport#EyesAndEarsOfDP pic.twitter.com/iVzZrdbZ6F
— Delhi Police (@DelhiPolice) August 11, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..