దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతమైన ఘజియాబాద్‌లోని సదర్ తహసీల్‌లో దారుణం వెలుగు చూసింది. న్యాయవాది మనోజ్ అలియాస్ మోను చౌదరి హత్య కేసులో సంచలన నిజం వెలుగు చూసింది. ఇది హత్యేనని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితుడు సొంత బావే అని తేల్చారు. బావమరిదిని తొలుత బెదిరించి.. ఆపై ఛాంబర్‌లోకి ప్రవేశించి పట్టపగలే కాల్పులు జరిపాడు బావ. దీంతో లాయర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు అమిత్ దాగర్ తన చాంబర్‌లో లాయర్ మోను చౌదరితో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుడి భార్య, హత్యకు గురైన లాయర్ సోదరి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ హత్యపై మోను చెల్లెలు కవిత ఘజియాబాద్‌లోని సిహాని గేట్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి, కవిత తన వాంగ్మూలంలో కీలక వివరాలు పేర్కొంది. మోనుకు నలుగురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. వీరిలో ఒకరైన కవితను అమిత్ దాగర్ వివాహం చేసుకున్నడు. అయితే, పెళ్లయిన కొద్ది రోజుల నుంచే కవిత, అమిత్ మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో కవిత.. తన భర్తను వదిలి.. పుట్టింటికి వచ్చేసింది. జూన్ నెలలో తన సోదరుడి వద్దకు వచ్చింది.
ఈ క్రమంలోనే కవితపై పగ పెంచుకున్న అమిత్.. ఆమెకు ఫోన్ తరచూ ఫోన్ చేస్తూ తోబుట్టువలందరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. కానీ, మోను మాత్రం వీరిద్దరినీ కలిపేందుకే ప్రయత్నించేవాడు. ఇదే అంశంపై బావ అయిన అమిత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి చాలాసార్లు వెళ్లాడు మోను. అయినప్పటికీ.. అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం అందరూ రాఖీ పండుగ చేసుకుంటుండగా.. అమిత్ నుంచి కవితకు కాల్ వచ్చింది.
ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో.. మోనుకు ఫోన్ చేశాడు అమిత్. ‘కవిత ఫోన్ ఎత్తడం లేదు. మీ రాఖీ పండుగను పాడు చేస్తానని మీ అక్కకు చెప్పు.’ అంటూ నేరుగా మోనును బెదిరించాడు అమిత్. వెంటనే కాల్ కట్ చేశాడు మోను. అమిత్ బెదిరింపులతో మోను కుటుంబం బయపడిపోయింది. మోను మాత్రం లైట్ తీసుకుని, ఎప్పటిలాగే తహసీల్‌కు బయలుదేరాడు. జాగ్రత్తగా ఉండాలని ఇంట్లోని వారు మోనును అలర్ట్ కూడా చేశారు.
సదర్ తహసీల్‌లోని ఛాంబర్ నంబర్ 95లోకి మోను వెళ్లాడు. ఆ కాసేపటి తరువాత బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చాయి. మోను చాంబర్‌లోకి ప్రవేశించగా.. అప్పుడు అతను భోజనం చేస్తున్నాడు. అయినప్పటికీ కనికరించకుండా కాల్చి చంపేశారు. ఘటన జరిగిన సమయంలో దుండగులు ఎవరో స్పష్టంగా గుర్తించలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు అగంతకులు బైక్‌పై తహసీల్ వద్దకు వచ్చి ఛాంబర్ ముందు బైక్‌ను పార్క్ చేసి లోపలికి ప్రవేశించడం ఈ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. దుర్మార్గులిద్దరూ ముఖానికి రుమాలు కట్టుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, నిందితుడు సొంత బావ కావడంతో అతను ఛాంబర్‌లోకి ప్రవేశించిన వెంటనే, న్యాయవాది మోను చౌదరి అతనికి స్వాగతం పలికారు. చాలా మంచి టైమ్‌కి వచ్చావ్ అన్నాడు. భోజనం చేద్దాం అంటూ పిలిచాడు. అయితే, అమిత్ తన ప్యాంటు జేబులో నుంచి పిస్టల్ తీసి కాల్పులు జరిపాడు. దీంతో మోను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పుల శబ్దం విని, ఇతర లాయర్లు మోను వద్దుకు పరుగెత్తుకెళ్లారు. కానీ, అప్పటికే నిందితుడు అతని సహచరుడు నితిన్ దాగర్‌తో కలిసి బైక్‌పై తప్పించుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని నగర్ డీసీపీ నిపున్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన అమిత్‌తో పాటు మరో ఐదుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది జనవరిలో కూడా నిందితులు తమ ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని మృతురాలి సోదరి కవిత తెలిపారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన అమిత్.. బెయిల్ పై విడుదలై మళ్లీ ఘాతుకానికి పాల్పడ్డాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..