AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi High Court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. బంధీగా ఉన్న కుమార్తెను కలిసేందుకు అనుమతి

Virendra Dev Dixit ashram case: దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది.

Delhi High Court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. బంధీగా ఉన్న కుమార్తెను కలిసేందుకు అనుమతి
Delhi High Court
Balaraju Goud
|

Updated on: Apr 26, 2022 | 6:40 PM

Share

Delhi High Court: దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది. మరోవైపు ఆ దంపతులు, ఆశ్రమంలో ఉన్న తమ కూతురును కలిసేందుకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మీనావతి, రాంరెడ్డి దంపతుల కూతురు సంతోష్ రూపా అమెరికాలో నానో టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఆధ్యాత్మకం చింతన పేరుతో ఆకర్షితురాలైన సంతోష్ రూపా ఇండియాకు తిరిగి వచ్చి.. నేరుగా ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమంలో చేరిపోయారు. అప్పటినుంచి సంతోష్ రూపాను కలిసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. కన్న కూతురును కలిసేందుకు ఆశ్రమ నిర్వాహకులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమార్తెను కలిసేందుకు అనుమతించాలని, ఆశ్రమ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వీరేంద్ర దీక్షిత్ తమ కుమార్తెను తప్పుదోవ పట్టించి, ఏడేళ్లుగా బంధీగా ఉంచుకున్నాడని పిటిషన్‌లో ఆ దంపతులు పేర్కొన్నారు. ‌ఆశ్రమంపై చాలా ఏళ్ల నుంచి అనేక ఆరోపణలున్నాయని.. ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్, తనను తాను మహాశివుడి అవతారంగా ప్రకటించుకుని మోసాలకు పాల్పడుతున్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఆయన ఆశ్రమంలో 168 మంది మహిళల్ని బందీలుగా చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. మహిళల్ని ఇరుకైన గదుల్లో ఉంచి, వాళ్లకు మాదకద్రవ్యాలు అలవాటు చేసి, మానసికంగా, శారీరకంగా మోసం చేస్తున్నారని కూడా ఆరోపణలొచ్చాయి.

అంతేకాదు, వీరేంద్ర దీక్షిత్‌పై అత్యాచార కేసులతోపాటు మరో పది కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో 2017లో పోలీసులు ఆశ్రమంపై దాడి చేశారు. ఆ సమయంలో దొంగబాబా వీరేంద్ర దీక్షిత్ పారిపోయాడు. దీంతో వీరేంద్ర దీక్షిత్‌పై సీబీఐ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. ఆచూకీ చెబితే ఐదు లక్షల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అయితే, అప్పటినుంచి వీరేంద్ర దీక్షిత్ పరారీలోనే ఉన్నాడు.

కాగా, మీనావతి-రాంరెడ్డి దంపతులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ సాంగీ ధర్మాసనం విచారణ జరిపింది. ఆశ్రమ నిర్వాహకుడు పరారీలో ఉన్నప్పుడు ఆశ్రమాన్ని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐని ప్రశ్నించింది. కాగా, ఆశ్రమ బాధ్యతల్ని కిరణ్ బేడీకి అప్పగించింది. ఆశ్రమంలోని మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమిటీ వేసింది. కిరణ్ బేడీ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో రోహిణి జిల్లా మెజిస్ట్రేట్, ఢిల్లీ మహిళా నేర విభాగం డీసీపీ, జిల్లా న్యాయ సేవల విభాగం కార్యదర్శిలను సభ్యులుగా నియమించింది. మరోవైపు ఆశ్రమంలో ఉన్న దంపతుల కుమార్తె సంతోష్ రూపాను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Read Also… Cocaine Seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌