Sadhguru: సద్గురు అరెస్ట్ అంటూ ఫేక్ యాడ్స్.. ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు..

యూట్యూబ్‌లో సద్గురు పేరుతో ఫేక్ ప్రకటనలు, ముఖ్యంగా అరెస్టు అంటూ తప్పుడు ప్రచారాలు పెరిగిపోవడంతో ఢిల్లీ హైకోర్టు కఠినంగా స్పందించింది. ఈ నకిలీ మోసాలను అడ్డుకోవడానికి గూగుల్ తప్పనిసరిగా తన ఏఐ టూల్స్‌ను వాడాలని కోర్టు ఆదేశించింది. గతంలో ఆదేశించినా మోసాలు పెరగడంతో ఇషా ఫౌండేషన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో గూగుల్, ఇషా ఫౌండేషన్ కలిసి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోర్టు సూచించింది.

Sadhguru: సద్గురు అరెస్ట్ అంటూ ఫేక్ యాడ్స్.. ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు..
Delho High Court On Sadhguru Fake Arrest Ads

Updated on: Oct 22, 2025 | 6:16 AM

యూట్యూబ్‌లో సద్గురు, ఇషా ఫౌండేషన్ పేరుతో మోసపూరితమైన ఏఐ డీప్‌ఫేక్ యాడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నకిలీ ప్రకటనలను ఆపడానికి గూగుల్ తన వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అక్టోబర్ 14న జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సద్గురును అరెస్టు చేసినట్లు చూపించే తప్పుడు ప్రకటనలను వెంటనే ఆపాలని కోర్టు స్పష్టం చేసింది.

ఇషా ఫౌండేషన్ పదేపదే ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు.. గూగుల్ – ఇషా ఫౌండేషన్ కలిసి కూర్చుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోర్టు సూచించింది. గతంలో కోర్టు చెప్పినట్లుగా ఒకసారి తీసివేసిన నకిలీ ప్రకటనలు మళ్లీ రాకుండా ఉండేందుకు గూగుల్ ఆటోమేటిక్ టూల్స్ వాడాలని కోర్టు గుర్తు చేసింది.

ఎందుకు ఆందోళన..?

ఈ నకిలీ ప్రకటనలు ప్రజల్లో ఉన్న సద్గురు నమ్మకాన్ని వాడుకొని, మోసపూరిత పెట్టుబడి పథకాలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా సద్గురు అరెస్టు లాంటి తప్పుడు సమాచారం వేలాది మంది ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ మోసాల బారిన పడకుండా ఉండటానికి, సద్గురును తప్పుగా చూపే ఏ వీడియో లేదా ప్రకటన కనిపించినా వెంటనే యూట్యూబ్‌లో రిపోర్ట్ చేయాలని ఇషా ఫౌండేషన్ ప్రజలను కోరుతోంది.

గతంలోనూ హైకోర్టు ఆదేశాలు

గత మే 30న ఢిల్లీ హైకోర్టు సద్గురు వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ, నకిలీ వీడియోలు, పోస్ట్‌లు, ప్రకటనల ద్వారా ఉల్లంఘనకు పాల్పడుతున్న ఛానెల్స్, కంటెంట్‌ను తొలగించాలని గూగుల్‌‌ను ఆదేశించింది. అయినప్పటికీ యూట్యూబ్‌లో నకిలీ, మోసపూరిత ప్రకటనలు విపరీతంగా పెరిగాయని ఇషా ఫౌండేషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీంతో మరోసారి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి