
Arvind Kejriwal
ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యమనా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఆ నది నీటిమట్టం వార్నింగ్ మార్క్‌ను దాటి.. ప్రమాద స్థాయికి చేరింది. దీంతో వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదని.. ప్రజలకు సహాయం చేసేందుకు అందరం కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. యమునా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో కేంద్ర జల కమిషన్‌ను సైతం సంప్రదించామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో వరదలు వచ్చే పరిస్థితులు లేవని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు.
అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రోడ్లపై గంతలు ఎప్పటికప్పుడు పూడుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇటీవల ఢిల్లీలో రోడ్లు కుంగిన ఘటనలపై కూడా విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 204.63 మీటర్లకు చేరింది. అయితే మంగళవారం నాటికి ఈ నీటిమట్టం 205.5 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు సహాయక చర్యల కోసం 16 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అలాగే క్విక్ రెస్పాన్స్ టీమ్, బోట్లను కూడా అందుబాటులో ఉంచారు.