బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలో ఎల్లో అలర్ట్!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. బాలాసోర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం.. పశ్చిమబెంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలో ఎల్లో అలర్ట్!
Deep Depression In Bay Of Bengal

Updated on: May 29, 2025 | 5:05 PM

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. బాలాసోర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం.. పశ్చిమబెంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతున్నందున, అది తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ భావిస్తోంది. గురువారం మే 29న ఉదయం 11:30 గంటలకు సాగర్ ద్వీపం-ఖేపుపారా మధ్య పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను డీప్ డిప్రెషన్ దాటిందని IMD పేర్కొంది. సాయంత్రం వరకు ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోల్‌కతాతో సహా బెంగాల్‌లోని అనేక జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించింది.

ఇక, ఇప్పటికే.. ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వాయుగుండం ప్రభావంతో.. మరో 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఏపీలోని 10 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి, వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

నైరుతి రుతుపవనాలు విస్తరణతో తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ పలు చోట్ల వర్షం పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..