రాజస్థాన్ జోథ్‌పుర్‌లో ఓ పెళ్లిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోలన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వం అందిస్తామన్న రూ.17 లక్షల పరిహారాన్ని రూ.50 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అయినా ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. రూ.17 లక్షల ప్యాకేజీకే పట్టుబట్టింది. దీంతో బాధితులు ఆ రు.17 లక్షల ప్యాకేజీని తీసుకోలేక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కాగా..రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తెలిసిందే. పెళ్లి ఇంట్లో ఈ ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. భుంగ్రా గ్రామంలో ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 60 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నీటి ట్యాంకర్లతో మంటలను అదుపుచేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో చికిత్స తీసుకుంటూ.. ప్రాణాలు కోల్పోయారు. ఇలా నలుగురి నుంచి మొదలైన సంఖ్య చివరకు 35 చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్న వైద్యులు, అధికారుల ప్రకటనలతో బాధిత కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో పడ్డాయి. బాధితులకు మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..