చనిపోయాడనుకున్న వ్యక్తి ఏకంగా 23 ఏళ్ల తర్వాత సజీవంగా ఇంటికి తిరిగొస్తే.. ఆ అనుభూతి చెప్పనలవి కాదు. తాజాగా చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు కర్మకాండలు చేసి దాదాపు అతన్ని మర్చిపోతున్న సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ ఒడిశా తీరాన్ని అతలాకుతలం చేసింది. వేలాదిమందిని పొట్టపెట్టుకుంది. ఎంతోమంది గల్లంతయ్యారు. ఆ సమయంలో పూరీ జిల్లా నిమాపడ ఠాణా పరిధిలోని పాతి గ్రామానికి చెందిన బొరాల్ అనే వ్యక్తి ఆచూకీ కూడా తెలియకుండాపోయింది.
ఆయన కోసం కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి కర్మకాండ చేయించారు. తుపాను సమయంలో ఒడిశాలో మాయమైన బొరాల్ విశాఖపట్నం చేరుకున్నాడు. అక్కడ పన్నెండేళ్ల తర్వాత ఓరోజు మానసిక వ్యాధితో బాధపడుతూ రహదారి పక్కన పడి ఉన్న బొరాల్‌ను విశాఖపట్టణం వార్డు కార్పొరేటరు ఒకరు కాపాడి విశాఖలోని మిషనరీ ఆఫ్ ఛారిటీ మదర్ థెరెసా కేంద్రానికి అప్పగించారు.
అక్కడ అతనికి వైద్యం చేస్తున్న సమయంలో బొరాల్ నోటి వెంట శ్రీకాకుళం అనే పదం వచ్చింది. దాంతో 2014లో ఆయనను శ్రీకాకుళంలోని నిర్మల హృదయ భవన్‌కు పంపగా, అక్కడినుంచి రెండు నెలల క్రితం ఆయనను నిర్వాహకులు బ్రహ్మపురలోని మిషనరీ ఆఫ్ ఛారిటీకి పంపారు. ఇటీవల కోల్‌కతాలోని మిషనరీ ఆఫ్ ఛారిటీ బ్రదర్స్‌కు చెందిన సాజన్ జోషఫ్ బ్రహ్మపుర వచ్చారు. ఆయన బొరాల్ కుటుంబ సభ్యులు ఎవరు, ఎక్కడ ఉంటారో గుర్తించేందుకు పశ్చిమబెంగాల్‌కు చెందిన హామ్ రేడియో సంస్థ కార్యదర్శి అంబిస్ నాగబిశ్వాస్ సాయం కోరారు. ఆయన సహకారంతో ఎట్టకేలకు బ్రహ్మపుర కేంద్రం నిర్వాహకులు బొరాల్ కుటుంబ సభ్యుల్ని గుర్తించారు. ఇటీవల బ్రహ్మపుర వచ్చిన వారు ఆయనను గుర్తించి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు బ్రహ్మపుర నుంచి సొంతూరుకు తీసుకువెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..