Cyclone Tauktae: తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా

|

May 15, 2021 | 10:05 AM

కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ రాబోతుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను... ఇవాళ భీకర తుఫానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Cyclone Tauktae:  తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా
Tauktae
Follow us on

Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ రాబోతుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను… ఇవాళ భీకర తుఫానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు ఇది తీరం దాటే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను ఏర్పడబోతున్నట్లుగా వాతావరణ విభాగం హెచ్చరించింది. దేశంలోని పశ్చిమతీరం నుంచి తుఫాను ఉంటుందని అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.

దీని ప్రభావం పశ్చిమాన ఉన్న కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్రపై ఎక్కువ ప్రభావం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అటు, అవసరమైతే అన్ని రకాలుగా సాయం అందిస్తామని ఇండియన్ నేవీ ప్రకటించింది. భారత నౌకాదళ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డైవింగ్ టీమ్స్, విపత్తుల బృందాలు అన్నీ తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని ఓ ట్వీట్‌లో నేవీ అధికారులు తెలిపారు.


ప్రస్తుతం తుఫాను అరేబియా సముద్రంలో కొచ్చికి దగ్గరగా ఉండి… గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గుండ్రంగా తిరుగుతోంది. కేరళలోని కన్నూర్‌కి నైరుతీ దిశలో… 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం వాయవ్య దిశలో కదులుతున్న ఈ తుఫాను మే 18 ఉదయం నాటికి… గుజరాత్ తీరానికి దగ్గర్లో తీరం దాటవచ్చనే అంచనా ఉంది. అయితే.. దీని ప్రభావం డైరెక్టుగా కాకుండా… పరోక్షంగా తెలుగు రాష్ట్రాలపై పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఉన్న మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

తుఫానుపై అప్రమత్తమైన భారత వాతావరణ శాఖ… అరేబియా సముద్రంలోకి ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ 3న ఇలాగే ఓ బురేవీ తుఫాను… కేరళ ప్రాంతాల్లో తీరంలో అల్లకల్లోలం సృష్టించింది. మరోవైపు, ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 31 నాటికే కేరళను తాకవచ్చని పేర్కొంది. మామూలుగా అయితే… జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. అటు, దక్షిణ అండమాన్ తీరంలో చల్లటి గాలులు వస్తున్నాయి. మే 21 నుంచి అక్కడ వర్షాలు కురుస్తూ… ఆ గాలులు క్రమంగా పశ్చిమం వైపు వెళ్తూ… బంగాళాఖాతం నుంచి టర్న్ తీసుకుని కేరళవైపు వస్తాయని తెలిపింది.

Cyclone Tauktae

Read Also…. Forward Message: ప్రాణం తీసిన ఫార్వర్డ్ మెసేజ్.. పోలీసుల వేధింపులే కారణమంటున్న భార్య