పసిడి ధరలు మరింత పెరగనున్నాయి. పార్లమెంటులో శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. మహిళలకు చేదైన ఈ విషయం ప్రకటించారు. బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో బంగారు ఆభరణాలు మరింత ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో బాటు డాలర్ తో రూపాయి మారకం బలహీనపడడంతో ఇప్పటికే భారమైన బంగారం ధరలు ఈ సుంకం పెంపుతో మరింత పెరగనున్నాయి. అటు-పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయి. లీటర్ పెట్రోలు, డీజిల్ పై ఒక రూపాయి సెస్ విధిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంకారణంగా .. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగనున్న నేపథ్యంలో ముఖ్యంగా సామాన్యుడు ఉసూరుమంటున్నాడు. ఇప్పటికే వీటి ధరలు తరచూ మారుతున్నాయి. బహుశా పెట్రోలు ఉత్పత్తిదారుల డిమాండ్ మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అయితే తాజా బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతానికి ఈ సంస్థలు పెదవి విప్పడంలేదు.