నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ.. బార్డర్‌లో హై అలర్ట్..

నేపాల్‌లోని బిర్గుంజ్‌లో మతపరమైన అశాంతి హింసాత్మకంగా మారింది. సోషల్ మీడియా వీడియోల నుంచి మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చడంతో కర్ఫ్యూ విధించారు. భారత సరిహద్దులో భద్రత పెంచారు. వందలాది మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ.. బార్డర్‌లో హై అలర్ట్..
Curfew Imposed In Nepal Birgunj

Updated on: Jan 06, 2026 | 9:40 PM

భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్‌లోని పర్సా జిల్లాలో ఒక్కసారిగా మతపరమైన అశాంతి చెలరేగింది. బిర్గుంజ్ పట్టణంలో సోషల్ మీడియా వీడియోల ద్వారా మొదలైన వివాదం హింసాత్మక నిరసనలకు దారితీయడంతో నేపాల్ అధికారులు అక్కడ కర్ఫ్యూ విధించారు. అటు నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్‌లోని రక్సౌల్ వద్ద భారత భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.

అసలేం జరిగింది?

నేపాల్‌లోని ధనుషా జిల్లా సఖువా మారన్ ప్రాంతంలో ఒక మసీదుపై దాడి జరిగినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి ప్రతిచర్యగా ఇద్దరు ముస్లిం యువకులు హిందూ వ్యతిరేక కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, బిర్గుంజ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు.

హింసాత్మకంగా మారిన నిరసనలు – కర్ఫ్యూ విధింపు

నిరసనకారులు స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే జిల్లా పరిపాలన కార్యాలయం బిర్గుంజ్‌లో కర్ఫ్యూ విధించింది. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో తొలుత మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఉన్న కర్ఫ్యూను మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు.

సరిహద్దులు మూసివేసిన భారత్

నేపాల్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సేవలు మినహా సాధారణ పౌరుల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ సరిహద్దులను మూసివేసింది. ముఖ్యంగా బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

భారత కార్మికుల వెనక్కి..

బిర్గుంజ్, పరిసర ప్రాంతాల్లో పరిస్థితి విషమించడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వందలాది మంది భారతీయ వలస కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో చాలా మంది కార్మికులు ఇప్పటికే నేపాల్ వదిలి భారత్‌కు తిరిగి రావడం ప్రారంభించారు. ప్రస్తుతానికి పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.