Corona 4th wave in India: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 5,233 కొత్త కరోనావైరస్ (Coronavirus) కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. సోమవారంతో పోల్చుకుంటే.. మంగళవారం దాదాపు 40 శాతం కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 1,881 కేసులు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటింది.
ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 28,857కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.06 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 3,345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.72 శాతానికి చేరుకుంది.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.12 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 194.43 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న 14,94,086 మందికి టీకాలు ఇచ్చారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం.. జూన్ 7 వరకు దేశ వ్యాప్తంగా 85,35,22,623 నమూనాలను పరీక్షించారు. మంగళవారం 3,13,361 మందికి కరోనా పరీక్షలు చేశారు.
మహారాష్ట్ర, కేరళలో..
కాగా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భారీ స్థాయిలో పెరుగుతోంది. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం ఈ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. తాజాగా కేరళలో 2,271 కేసులు.. మహారాష్ట్రలో 1881 కేసులు నమోదయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..