Zamoto: జొమాటోకు బిగ్ షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు జరిమానా ఎంతంటే..
ఆకలేస్తే త్వరగా ఏదో ఒకటి తినాలనుకుంటాం.. జనరల్ గా అయితే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ లేదా హోటల్, బేకరీకి వెళ్లి ఏదో ఒకటి తింటుంటాం.. కాని ఆర్డర్ చేసుకున్న తర్వాత నిమిషాల వ్యవధిలోనే..

Zamoto: ఆకలేస్తే త్వరగా ఏదో ఒకటి తినాలనుకుంటాం.. జనరల్ గా అయితే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ లేదా హోటల్, బేకరీకి వెళ్లి ఏదో ఒకటి తింటుంటాం.. కాని ఆర్డర్ చేసుకున్న తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఫుడ్ డెలివరీ చేసే యాప్ లు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కాని కొన్నిసార్లు ఆఏరియాలో డెలివరీ పార్టనర్స్ అందుబాటులో లేకపోవడం, రెస్టారెంట్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ అందుబాటులో లేకపోతే డైరెక్ట్ గా ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అందించే సంస్థ ఆర్డర్ ను క్యాన్సిల్ చేస్తుంటుంది. ఇలా చేసినప్పుడు మనకు ఎక్కడలేని కోపం వస్తుంది. అసలే ఆకలితో కడపులో ఎలుకలు పరుగెడుతుంటే.. ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సిల్స్ అయితే అప్పుడు వచ్చే కోపమే వేరు. అలా కస్టమర్ అనుమతి లేకుండా ఆర్డర్ చేసిన ఫుడ్ ని క్యాన్సిల్ చేసినందుకు జొమాటో సంస్థకు షాకిచ్చింది చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10వేల జరిమానా చెల్లించడంతో పాటు.. ఉచితంగా ఒకరోజు భోజనాన్ని సరఫరా చేయాలని సూచించింది. 2020లో చండీగఢ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఈకేసులో చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా తీర్పు వెలువరించింది.
చండీగఢ్ కు చెందిన అజయ్ కుమార్ శర్మ ఫుడ్ ఆర్డర్ డెలివరీ యాప్ జొమాటోలో రాత్రి 10.30 గంటల సమయంలో పిజ్జా ఆర్డర్ చేశాడు. ఇన్ టైమ్ లో డెలివరీ చేయడానికి రూ.10 సేవా రుసుము చెల్లించాడు. అన్ని ట్యాక్స్ లు కలుపుకుని రూ.287 బిల్లు అయింది. బుక్ చేసిన కాసేపటికే అజయ్ శర్మ చేసిన ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ మెసేజ్ వచ్చింది. కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని తిరిగి అకౌంట్ కి జమచేసినట్లు తెలిపింది. టైమ్ కు ఆర్డర్ ఇవ్వకపోగా.. క్యాన్సిల్ చేయడంతో అజయ్ శర్మకు ఆగ్రహం తెప్పించింది.
తన అనుమతి లేకుండా తాను చేసిన ఆర్డర్ క్యాన్సిల్ చేయడంపై అజయ్ కుమార్ శర్మ తొలుత జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ అజయ్ శర్మకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అజయ్ కుమార్ శర్మ తన పిల్లల కోసం ఆర్డర్ చేశాడని, రాత్రి వేళ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వారి మనోభావాలు దెబ్బతిని ఉండవచ్చని.. వీటిని ఈసందర్భంగా పరిగణలోకి తీసుకోవల్సిన అవసరం ఉందని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అభిప్రాయపడింది. దీంతో జొమాటో సంస్థకి రూ.10వేలు జరిమానా విధించడంతో పాటు ఫిర్యాదుదారుడికి 30 రోజుల్లోపు ఒక భోజనాన్ని ఉచితంగా పంపించాలని ఆదేశించింది. సమయానికి ఫుడ్ డెలివరీ చేయలేనప్పుడు ఆన్ టైమ్ డెలివరీ వంటి ప్రకటనలు ఇవ్వవద్దని జొమాటో సంస్థకు సూచించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..