
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దేశ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఈ పనులు వాయిదాపడ్డాయి. సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో హిందూ సంస్థలు చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ తీరును నిరసిస్తూ.. చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు హిందూ సంఘాల కార్యకర్తలు. ఈ క్రమంలోనే శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాల్వన్ ఘర్షణలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ.. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశానికి మద్దతుగా నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.