Farmer protests: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు గురువారం ఉదయం 10.45 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షల సంతకాల ప్రతులను రాష్ట్రపతికి అందజేయనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఈ సంతకాలు సేకరించింది. కాగా, రాహుల్ గాంధీ కాలినడకన రాష్ట్రపతి భవనానికి వెళ్లనున్నారు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.
కాగా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధానిలోని శివారులో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రోజుకో తరహాలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కేంద్రం కొన్ని సవరణలకు సిద్దమని ప్రకటించినా.. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కొనసాగుతోంది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్రపతితో సమావేశం కానుంది.
అలాగే పంజాబ్, హర్యానాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ ఢిల్లీకి రావాల్సిందిగా వారు కోరారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎంపీలకు కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.