Chinese Indian Border Troops : గత కొంతకాలంగా ఉద్రిక్తతలతో వేడెక్కిన మంచు కొండలు మెల్లమెల్లగా చల్లబడుతున్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల నుంచి భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ జోరందుకుంది. ఆసియా దిగ్గజాలైన ఇరుదేశాలు పలు దఫాలుగా జరిపిన చర్చలు కాస్త ఫలించినట్లు కనిపిస్తుంది. అయితే, ఇప్పటికైతే తమ దళాలను వెనక్కి తీసుకున్నా, అంతర్గతంగా విభిన్న ప్రణాళికలతో ఉన్నాయి.
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సీనియర్ సైనిక కమాండర్ల మధ్య పది విడతలుగా చర్చలు జరిగాయి. కఠినతర పరిస్థితులు ఉండే శీతకాలం కూడా ముగిసింది. దీంతో తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత, చైనా దళాలు వెనక్కి తగ్గడం మొదలైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం- ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ మొహరించిన బలగాల ఉపసంహరణ పూర్తయ్యాకే గోగ్రా-హాట్ స్ప్రింగ్స్, డెస్పాంగ్ వంటి ఘర్షణలు తలెత్తిన ఇతర ప్రాంతాల గురించి యోచించే అవకాశం ఉంది.
Raksha Mantri Shri @rajnathsingh will make a statement in Rajya Sabha tomorrow regarding ‘Present Situation in Eastern Ladakh’.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) February 10, 2021
కాగా. బలగాల ఉపసంహరణకు సంబంధించిన దృశ్యాల్లో ట్యాంకులు తిరిగి వెళుతూ ఉండటం, గుడారాలు, షెల్టర్లను ధ్వంసం చేయడం, బలగాలు వెనక్కి తరలుతుండటం వంటి అంశాలకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల భారత్, చైనాల ప్రణాళికల మేరకే జరగడం లేదని తెలుస్తోంది.
భారత్, చైనా ఘర్షణలపై అమెరికా ఎన్నికల ప్రభావమూ పడిందని చెప్పాలి. ట్రంప్ ఓటమి భారత్ దూకుడుకు కొంత కళ్లెం వేసింది. ఎందుకంటే, చైనాతో ఘర్షణ మరింత విస్తృత స్థాయికి పెచ్చరిల్లితే, భారత్‌కు ప్రత్యక్షంగా సాయం చేసేందుకు కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోని అమెరికా రంగంలోకి దిగుతుందనే గ్యారంటీ లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, చైనాల వైఖరులు, పరస్పరం ఢీకొనడం వంటి చర్యలు- ఈ రెండు దేశాలపట్లా అమెరికా అనుసరించే ధోరణి ఎలా ఉంటుందనే అంశంపైనా ఆధారపడి ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠంపై కొనసాగడానికి ఈ పరిణామాలకూ సంబంధం ఉంది. అయితే, ట్రంప్ అధికారం కోల్పోవడం కీలక మలుపుగా భావించవచ్చు. అది- చైనాపై అమెరికా విధానంలో పెద్ద మార్పును తీసుకొచ్చిందంటున్నారు విశ్లేషకులు.
మరోవైపు, ట్రంప్ నిష్క్రమణతో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ‘క్వాడ్’ సమూహానికి కళ తగ్గింది. చైనా దుందుడుకు చర్యలను ఎదుర్కొనే విషయంలో కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఎంతమేర ముందుకు సాగుతారనే దానిపై తదుపరి పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికైతే, బైడెన్ రష్యా వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఐరోపా కేంద్రంగా ‘నాటో’ను పునరుద్ధరించడానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. చైనా వ్యతిరేక ఇండో-పసిఫిక్ విధానంపై దూకుడుగా వెళ్లకపోవచ్చు. ‘క్వాడ్’ అడుగుల్లో తడబాటు కనిపించడం, చైనాకు వ్యతిరేకంగా అమెరికా కఠిన చర్యలు తీసుకొనే పరిస్థితులు లేకపోవడంతో భారత్‌పై తన వ్యవహారశైలిని మార్చుకునేందుకు చైనాకూ పెద్దగా కారణాలు కనిపించడం లేవని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి… తప్పతాగిన చిందులేసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్‌తో చర్యలు.. టీచర్‌తో సహా ముగ్గురిపై వేటు..!