Diwali 2021: దీపావళి వేళ చైనా నోట్లో పచ్చి వెలక్కాయ.. రూ.50,000 కోట్ల ఆదాయం ఫసక్..

|

Oct 30, 2021 | 2:11 PM

Diwali 2021: భారత్‌ పట్ల ఘర్షణాత్మక వైఖరి కారణంగా పొరుగుదేశం చైనా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ప్రస్తుత దీపావళి సీజన్‌లో చైనా వస్తువులను భారత వ్యాపారులు బాయ్ కాట్ చేయడంతో..

Diwali 2021: దీపావళి వేళ చైనా నోట్లో పచ్చి వెలక్కాయ.. రూ.50,000 కోట్ల ఆదాయం ఫసక్..
Boycotts of Chinese products
Follow us on

Diwali 2021: భారత్‌తో నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం కారణంగా పొరుగుదేశం చైనా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ప్రస్తుత దీపావళి సీజన్‌లో చైనా వస్తువులను భారత వ్యాపారులు బాయ్ కాట్ చేయడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు దాదాపు రూ.50,000 కోట్లు నష్టపోనున్నారు. దీంతో కొన్ని దశాబ్ధాలుగా దీపావళి సీజన్‌లో కోట్లు ఆర్జిస్తున్న చైనా ఎగుమతిదారుల నోట్ల పచ్చి వెలక్కాయ పడ్డట్లు అవుతోంది. అటు ఎగుమతి సుంకాల రూపంలో చైనా ప్రభుత్వానికి చేకూరే ఆదాయానికి కూడా గండిపడింది.

గత ఏడాదిలానే.. ఈ ఏడాది కూడా దీపావళి సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వ్యాపారులకు ముందుగానే పిలుపునిచ్చింది. ఆ మేరకు భారత వ్యాపారులు, దిగుమతిదారులు చైనా ఉత్పత్తులను దూరంపెట్టేశారు. దీపావళి సరకులు, బాణసంచాలు, ఇతర వస్తువుల కోసం భారత వ్యాపారులు, దిగుమతిదారులు చైనా ఎగుమతిదారులకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదని తమ పరిశీలనలో తేలిందని సీఏఐటీ సెక్రటరీ జనర్ ప్రవీణ్ ఖందేల్వాల్ వివరించారు. దాదాపు 20 నగరాల్లో ఈ పరిశీలన జరిపినట్లు తెలిపారు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, జైపూర్, లక్నో, చంఢీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కత్తా, రాంఛి, గౌహాతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పుదుచ్చేరి, భోపాల్, జమ్ములోని వ్యాపారులు చైనాకు దీపావళి సరకుల కోసం ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదని వివరించారు.

కాగా దీపావళి సీజన్‌లో దేశంలో రూ.2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నట్లు ప్రవీణ్ ఖందేల్వాల్ వివరించారు. చైనా సరకులను బాయ్ కాట్ చేయడం ద్వారా ప్రస్తుత దీపావళి సీజన్‌లో దేశంలోని వ్యాపారులకు లాభం చేకూరనుంది. కరోనా పాండమిక్ కారణంగా సతమతమవుతున్న వ్యాపారులకు ఇది కాస్త ఊరట కలిగించే అవకాశముంది.

గత ఏడాది జూన్ మాసంలో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్ ఆర్మీ జవాన్లపై చైనా సేనల దాడుల అనంతరం చైనాకు చెందిన పలు యాప్స్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం తెలిసిందే. గాల్వన్ ఘటన కారణంగా ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతోంది. ఈ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది.

Also Read..

Maruti Baleno Rating: మారుతి సుజుకి బాలేనో భద్రతా ప్రమాణాల్లో ఫెయిల్.. జీరో స్టార్ రేటింగ్!

Sleep Deprivation: నిద్రలేమితో ఇన్ని అనర్థాలా.. తాజా అధ్యయనంలో మరో షాకింగ్‌ న్యూస్‌..