మా సైనికుల్లో కమాండింగ్ ఆఫీసర్ కూడా హతమయ్యారు.. చైనా ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Jun 22, 2020 | 6:17 PM

ఈ నెల 15 న భారత దళాలతో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన తమ దేశ సైనికుల్లో ఓ కమాండింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారని చైనా ధృవీకరించింది. ఆ దేశం ఈ విధమైన ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. ఉభయ దేశాల దళాల వెనక్కి..

మా సైనికుల్లో కమాండింగ్ ఆఫీసర్ కూడా హతమయ్యారు.. చైనా ప్రకటన
Follow us on

ఈ నెల 15 న భారత దళాలతో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన తమ దేశ సైనికుల్లో ఓ కమాండింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారని చైనా ధృవీకరించింది. ఆ దేశం ఈ విధమైన ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. ఉభయ దేశాల దళాల వెనక్కి మళ్లింపుపై చైనాకు చెందిన ఛుషుల్ భూభాగంలోని మోల్డోలో జరిగిన చర్చల సందర్భంగా ఆ దేశ సైనికాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. (లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఈ చర్చలు జరిగాయి). గత సోమవారం లదాఖ్ లోని వివాదాస్పద బోర్డర్ లో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే చైనా సైనికుల్లో 45 మంది గాయపడడమో,  మరణించడమో జరిగిందని భారత సైన్యం ప్రకటించినప్పటికీ.. చైనా ఖఛ్చితంగా తమ దేశ సోల్జర్స్ ఎంతమంది మరణించారన్న విషయాన్ని వెల్లడించలేదు. చాలా ఆలస్యంగా.. తమ వైపున 30 మంది మృతి చెందినట్టు పేర్కొంది. అయితే సంఖ్య చెబితే మళ్ళీ ఘర్షణలు, ఉద్రిక్తతలు పెరుగుతాయేమోనని ఆందోళన చెంది తాము మౌనం వహించామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మూడు చైనా  ప్రాజెక్టులను రద్దు చేసుకున్న మహారాష్ట్ర

ఇక.. చైనాపై మహారాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా కసి తీర్చుకుంది. లడాఖ్ లో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు ఇరవై మంది మృతి చెందిన నేపథ్యంలో.. మూడు చైనా ప్రాజెక్టులను ప్రభుత్వం వదులుకుంది. ఈ ఘర్షణ జరగడానికి ముందే నిర్వహించిన ‘మాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0’ ఇన్వెస్టర్ల మీట్ సందర్భంగా మొత్తం 5 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు సర్కార్ నీళ్లొదులుకుంది. కేంద్రంతో సంప్రదించాక తామీ నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు. కేంద్రం నుంచి అందే  తదుపరి ఆదేశాల కోసం వేచి ఉన్నామని ఆయన  చెప్పారు. చైనాకు చెందిన హెంగ్లీ ఇంజనీరింగ్ కంపెనీతో రూ. 250 కోట్లు, గ్రేట్ వాల్ మోటార్స్ తో 3,770 కోట్లు, పీఎంఐ ఎలెక్ట్రో మొబైలిటీ కంపెనీతో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి 3 ఎంఓయూలను మహారాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఆ సమావేశంలో చైనా రాయబారి సన్ వీడాంగ్ కూడా పాల్గొన్నారు. ఈ ఇన్వెస్టర్ల మీట్ జరిగిన రోజునే లదాఖ్ సరిహద్దుల్లో భారత-చైనా దళాల మధ్య పెను ఘర్షణ జరిగింది.