Maoist Encounter: దద్దరిల్లిన దండకారణ్యం.. 28 మంది మావోయిస్టుల హతం.. సుప్రీం కమాండర్ కేశవరావు మృతి..

ఆపరేషన్‌ కగార్‌ దూకుడు పెరిగింది. దట్టమైన అడువుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భద్రతాబలగాలు వారిని రౌండప్‌ చేస్తూ హతమారుస్తున్నాయి. తాజాగా.. చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి..

Maoist Encounter: దద్దరిల్లిన దండకారణ్యం.. 28 మంది మావోయిస్టుల హతం.. సుప్రీం కమాండర్ కేశవరావు మృతి..
Chhattisgarh Maoist Encounter

Updated on: May 21, 2025 | 12:37 PM

ఆపరేషన్‌ కగార్‌ దూకుడు పెరిగింది. దట్టమైన అడువుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భద్రతాబలగాలు వారిని రౌండప్‌ చేస్తూ హతమారుస్తున్నాయి. తాజాగా.. చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి.

అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మూడు జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.. ఉదయం నుంచి DRG జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు సమాచారం.. అంతేకాకుండా పలువురు కీలక నేతలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు .. వరంగల్ ఆర్ఈసీలో చదివారు. గంగన్న పేరుతో ఏవోబీలో కేశవరావు కీలక పాత్ర పోషించారు.

పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీ ఎన్కౌంటర్‌లో మృతి చెందడం.. మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే అతి భారీ నష్టంగా పేర్కొంటున్నారు. ఈ ఎన్‌కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎవరీ కేశవరావు?

గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బస్వరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ. మావోయుస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న వివిధ పేర్లు ఇవి.

కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట.. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతిదగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాతి తరంవాడైన కేశవరావు.. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాలేజీలో 1974లో ఇంజనీరింగ్ చదివారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు.

కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు.

అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయుస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ పై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది.

ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ.. తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రిక్రూట్మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది.

1980లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్టయ్యారు. ఆయన తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు.

ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి.. అలాగే.. తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..