Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది జవాన్లు మృతి చెందారు. మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఏడుగురు జవాన్ల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. కాగా, సుక్మా-బిజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గల్లంతైన జవాన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత 15 మంది మాత్రమే గల్లంతయ్యారని భావించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. దీనిని ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఇక గల్లంతైన జవాన్ల కోసం భద్రతా బలగాలు ఉదయాన్నే సెర్చ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఐజీ తెలిపారు. ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులు 1500 ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా-బిజాపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందింది. దాంతో 500 మంది భద్రతా సిబ్బంది అడవులను జల్లెడ పట్టారు. అలా కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తొలుత ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరో 30 మందికిపైగా జవాన్లు తీవ్రంగా గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగింది.
Also read: