
ఇటీవల గుండెపోటు మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి. శారీరకంగా ఫిట్‌గా కనిపించే యువకులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు సైతం ఒక్కసారిగా హార్ట్‌అటాక్‌తో కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అలాంటి దారుణమే చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్న డా. గ్రాడ్లిన్ రాయ్ (39) బుధవారం విధుల్లో ఉన్న సమయంలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి వార్డుల్లో రౌండ్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే తోటి వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
కార్డియాలజీపై లోతైన అవగాహన ఉన్న, ఎప్పుడూ జాగ్రత్తలు పాటించే ఒక కార్డియాక్ సర్జన్.. గుండెపోటుతోనే మృతి చెందడం వైద్య వర్గాలను షాక్‌కు గురి చేసింది. యువతలో పెరుగుతున్న హార్ట్‌అటాక్ కేసులకు ప్రధాన కారణాలు ఒత్తిడి, ఎక్కువసేపు పని చేయడం, అనారోగ్యకర జీవనశైలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు నిద్ర, రెస్ట్ లేకుండా డబుల్ షిఫ్ట్‌లలో పని చేయడంతో గుండెమీద తీవ్ర ఒత్తిడి పడుతుందంటున్నారు. అలాగే వ్యాయామం లేకపోవడం, ఆహారం తినే వేళల్లో మార్పులు, టెన్షన్‌తో కూడిన జీవనశైలి కూడా హార్ట్‌అటాక్స్‌కు దారితీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.