ఇస్రో చేబట్టిన ‘ చంద్రయాన్-2 ‘ మిషన్ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఓకె ! అయితే అప్పుడే ఈ మిషన్ పై ఫారిన్ మీడియా గొంతు చించుకోవడం ప్రారంభించింది. హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ ‘ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ నిర్మాణానికి అయిన టోటల్ బడ్జెట్ కన్నా ఈ మిషన్ ఖర్చు తక్కువేనని కొన్ని పత్రికలు ఎద్దేవా చేస్తే.. మరికొన్ని.. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ‘ అపోలో-2 ‘ వ్యోమగాములు చంద్రునిపైకి సాగించిన చరిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేశాయి. చంద్రయాన్-2 మిషన్ కి అయిన మొత్తం వ్యయం 124 మిలియన్ డాలర్లు (దాదాపు వెయ్యి కోట్లు).. ఇందులో లాంచ్ కి 31 మిలియన్ డాలర్లు.. శాటిలైట్ కి 93 మిలియన్ డాలర్లు. కూడా చేరాయి. కానీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం 35.6 కోట్ల డాలర్లని ‘ స్పుత్నిక్ ‘ పేర్కొంది. ఇక ‘ గార్డియన్ ‘ పత్రిక..ప్రతివారూ చంద్రునిపైకే వెళ్లాలనుకుంటున్నారని, ఎందుకీ వృధా ప్రయాస అన్నట్టు తన ఆర్టికల్ లో సెటైర్ వేసింది. తొలి అపోలో చంద్రయాన్ జరిగి 50 సంవత్సరాలు అవుతోంది. అయితే కొన్ని దేశాలు ఇప్పుడీ మిషన్లు నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఈ పత్రిక ప్రశ్నించింది. కొత్త స్పేస్ రేస్ వెనుక ఉద్దేశమేమిటని సందేహాన్ని వ్యక్తం చేసింది.
న్యూయార్క్ టైమ్స్ కూడా దాదాపు ఇదేవిధంగా వ్యాఖ్యానించింది. ఇండియా తన టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ ను చాటుకోవడానికే ఈ ప్రయోగం చేబట్టిందా అని ఈ పత్రిక కూడా డౌట్ వ్యక్తం చేసింది. చైనా ఇదివరకే ఇలాంటి ప్రయోగం చేపట్టిన విషయాన్ని ఈ డైలీ కూడా గుర్తు చేసింది.
అమెరికా, నాసా విషయానికి వస్తే.. చంద్రునిపై లాండింగ్ అన్నది పాత మాట.. అని, ఇప్పుడు అంగారక గ్రహం ప్రధానమైనది అని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో.. ఇండియాను కాస్త చులకన చేసి కామెంట్ చేస్తూ.. చైనా, ఇండియాతో బాటు ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు కూడా రోబోటిక్ మిషన్లను చేపడుతున్నాయని, ఇవి తమ టెక్నాలజికల్ బలాన్ని చాటుకుని గ్లోబల్ నేషనలిజం స్థాయికి పెరగాలన్నదే వీటి ఉద్దేశమని విమర్శించింది. భారత తొలి అంగారక ఉపగ్రహానికి పెట్టిన ఖర్చు.. స్పేస్ మూవీ.. ‘ గ్రావిటీ ‘ కి అయిన బడ్జెట్ కన్నా తక్కువేనని వాషింగ్టన్ పోస్ట్ అంచనా వేయడం విశేషం. అమెరికా తన ‘ అపోలో ‘ ప్రోగ్రామ్ కి పెట్టిన వ్యయం 25 బిలియన్ డాలర్లని ఈ డైలీ తెలిపింది.