
జులై 3న రాత్రి సెక్టార్ 34లోని ఓ మద్యం దుకాణం సమీపానికి రావాలని మంజీత్‌ను శుభి, పిండా అనే పరిచయస్తులు మంజీత్‌ను పిలిచారు. వారి మాట నమ్మి అక్కడికి వెళ్లిన మంజీత్‌ను ఇద్దరూ బలవంతంగా కారులో ఎక్కించుకుని మొరిండాకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ మల్బరీ చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఘటన అనంతరం మంజీత్‌కు పరిచయమైన ఓ వ్యక్తి అక్కడికి చేరుకుని దుప్పటితో మంటలను ఆర్పాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను మొదట మొరిండాలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మొహాలీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించగా.. జులై 9న మెరుగైన చికిత్స కోసం పీజీఐ చండీగఢ్‌కు రెఫర్ చేశారు. తీవ్ర కాలిన గాయాలతో పీజీఐలో చేరిన మంజీత్ కొన్ని వారాల పాటు కోమాలోనే ఉంది. ఆగస్టు 5న కొంత స్పృహలోకి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు తనకు జరిగిన విషయాన్ని వివరించింది. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో ఆగస్టు 26న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు పీజీఐ చండీగఢ్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మంజీత్ మొహాలీలోని సెక్టార్ 123, సన్నీ ఎన్‌క్లేవ్‌లో నివసించేవారు. ఆమెకు గతంలో వివాహం కాగా విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. మంజీత్ సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 1.46 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పంజాబీ, హర్యాన్వీ పాటలకు రీల్స్ చేయడంతో పాటు కాస్మెటిక్ ఉత్పత్తులకు సంబంధించిన కంటెంట్‌ను ఆమె పోస్టు చేసేవారు. యూట్యూబ్‌లోనూ ఆమెకు సుమారు 4 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కుమార్తె మృతిపై కాంతా దేవి సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చండీగఢ్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసినట్లు చండీగఢ్ ఎస్‌ఎస్‌పీ కన్వర్‌దీప్ కౌర్ ధ్రువీకరించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
అయితే మంజీత్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనకు జరిగిన విషయాన్ని చెప్పేందుకు మంజీత్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు కాలేదని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఖరార్ డీఎస్పీ ఇషాన్ సింగ్లా ఖండించారు. ఈ ఘటన చండీగఢ్ పోలీసుల పరిధిలోకి వస్తుందని, అందువల్ల తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చండీగఢ్ పోలీసులదేనని తెలిపారు. కుటుంబానికి ఖరార్ పోలీసులు సహకరించారని, ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియలోనూ సహాయం చేశామని చెప్పారు. సెక్టార్ 34 స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ షాదీ లాల్ కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు చండీగఢ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే మంజీత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా పరిశీలిస్తున్నారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మంజీత్ సోషల్ మీడియా ఖాతాలో ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్లతో వివాదాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి. కొంతమంది యువకులను దూషిస్తూ ఉన్న కంటెంట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు మంజీత్ నిందితుల్లో ఒకరితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. నిందితులకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని చండీగఢ్ పోలీస్ డీఎస్పీ (సౌత్) గుర్జిత్ కౌర్ తెలిపారు. తీవ్ర కాలిన గాయాలతో 54 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మంజీత్ చివరకు ప్రాణాలు కోల్పోవడంతో.. ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.