Farmers protest – Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సింఘు, ఘాజీపూర్, టిక్రీ తదితర ప్రాంతాల్లో 70 రోజులపై నుంచి చేస్తున్న ఈ ఆందోళనకు ప్రజల నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా మూడు గంటలపాటు చక్కా జామ్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడెంచెల భద్రతను ఏర్పాటు చేసి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహించనున్నట్లు బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. రాజు ఇప్పటికే భద్రతను పెంచుకున్నాడని.. అక్కడ దిగ్బంధనం చేసే అవసరం లేదని ఆయన ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ఢిల్లీ మినహా.. హర్యానా, రాజస్థాన్, పంజాబ్.. దక్షిణాది రాష్ట్రాలతో సహా అన్ని జాతీయ రహదారులపై చక్కాజామ్ నిర్వహించనున్నట్లు తికాయత్ పేర్కొన్నారు.
రేపు దేశవ్యాప్తంగా చక్కా జామ్ (రాస్తారోకో) మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్భంధనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీరు, ఆహార సౌకర్యాలు కల్పించాలని రైతు సంఘం నేతలు పలువురికి సూచించారు.
Also Read: