
దేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతీ ఏటా అర్హులైన రైతులకు పెట్టబడి సాయం అందిస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ. 6000 జమ చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ పథకంలో భాగంగా అందించే మొత్తాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. పెట్టుబడి సాయాన్ని రూ. 8 వేల నుంచి రూ. 12 వేలకి పెంచనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. దీనికి సంబంధించి తాజా బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయిస్తారని చర్చ జరిగింది. అయితే బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నిధుల పెంపు గురించి పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతనిస్తూ పీఎం కిసాన్ సాయం మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ముండా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. పీఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి రూ.12 వేలకు పెంచే ఉద్దేశమేదీ లేదని తేల్చి చెప్పారు. అలాగే మహిళా రైతులకు కూడా మొత్తాన్ని పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఇక పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు.
పీఎం-కిసాన్ అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలియజేశారు. దీనిద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే, ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాల్లో ఇది ఒకటని, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..