ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసుకు సంబంధించి అసలైన నిందితులు ఇప్పటివరకు పట్టుబడలేదు. పోలీసులతో బాటు సీబీఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా.. వారి ఆచూకీ తెలియకపోవడంతో ఇక వారి అరెస్టుకు దోహదపడే సమాచారం తెలిపినవారికి రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని ఈ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ధన్ బాద్ అంతటా పోస్టర్లను అతికించింది. తమకు సరైన సమాచారం ఇచ్చినవారి పేర్లను రహస్యంగా ఉంచుతామని కూడా పేర్కొంది. గత నెల 28 న ఉదయమే వాకింగ్ చేస్తున్న ఉత్తమ్ ఆనంద్ ను వెనుక నుంచి ఓ టెంపో ఢీ కొట్టి వెళ్లిపోగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి ఝార్ఖండ్ ప్రభుత్వం ‘సిట్’ బృందాన్ని కూడా నియమించింది. ఈ నెల 4 న సీబీఐ ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసింది. మరో మూడు రోజులకే లఖన్ వర్మ అనే ఆటో డ్రైవర్ ను, రాహుల్ వర్మ అనే అతడి స్నేహితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది. వారి రిమాండును కోర్టు 10 రోజుల వరకు పొడిగించింది.
కాగా ధన్ బాద్ జడ్జి కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ వర్గాలు తమను కాంటాక్ట్ చేయవల్సిన ఫోన్ నెంబర్లను కూడా పోస్టర్లలో పేర్కొన్నాయి .. అటు- ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నత్తనడకన సాగడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జడ్జి హత్య జరిగిన వెంటనే దర్యాప్తు జరిపి ఉంటే నిందితులు తప్పించుకుని పోగలిగి ఉండేవారు కారని పేర్కొంది. ఝార్ఖండ్ పోలీసుల ఉదాసీనతను కోర్టు తప్పు పట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి : పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.