
ముంబై నగరంలో వందలాది వలసకార్మికులు మూడు రోజులుగా ఫుట్ పాత్ పైనే గడుపుతున్నారు. రాత్రుళ్ళు అక్కడే నిద్రపోతున్నారు. శ్రామిక్ రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లడానికి వీరంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అద్దె చెల్లించలేకపోవడం వల్ల.. తాము ఉంటున్న ఇళ్ల యజమానులు ఇళ్లను ఖాళీ చేయమని బెదిరించడంతో ఆ వలస జీవులందరూ వడాలా పోలీసు స్టేషను వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం రైళ్లను రద్దు చేయడంతో వీరికి ఏం చేయాలో తోచడం లేదు. చేతిలో డబ్బు లేదు.. తినడానికి తిండి లేదు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీలు మూత బడడంతో చేతిలో పని లేకుండా పోయింది. ఈ వలస జీవుల్లో తొమ్మిది నెలల గర్భిణి కూడా ఉంది. అద్దె ఇళ్లకు తాము ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలని వీరు దీనంగా ప్రశ్నిస్తున్నారు. తమకు ఏదో ఒక దారి చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మహారాష్ట్రలో 44 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 1500 మంది కరోనా రోగులు మరణించారు. వీరిలో ఒక్క ముంబైలోనే మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది.