అతిశయోక్తులు, అభూత కల్పనలు.. ఎలా సాధ్యమో నిర్మలమ్మే చెప్పాలి

|

Feb 01, 2020 | 5:18 PM

నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో అతిశయోక్తులు, అసాధ్యాలు ఉన్నాయి.. అసలు బడ్జెట్‌ అంటేనే ఓ ఎనిగ్మా .. అర్థం చేసుకోవడం బహు కష్టం… మరో రెండేళ్లలో అంటే 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆర్ధికమంత్రి.. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తామన్నారు.. అలాగే జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌ను కూడా ఎంకరేజ్‌చేస్తామన్నారు.. ఈ ప్రోత్సహాకాలతో రైతుల ఆదాయం డబుల్‌ అవుతుందా..? ఆ మాటకొస్తే దేశ […]

అతిశయోక్తులు, అభూత కల్పనలు.. ఎలా సాధ్యమో నిర్మలమ్మే చెప్పాలి
Follow us on

నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో అతిశయోక్తులు, అసాధ్యాలు ఉన్నాయి.. అసలు బడ్జెట్‌ అంటేనే ఓ ఎనిగ్మా .. అర్థం చేసుకోవడం బహు కష్టం… మరో రెండేళ్లలో అంటే 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆర్ధికమంత్రి.. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తామన్నారు.. అలాగే జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌ను కూడా ఎంకరేజ్‌చేస్తామన్నారు.. ఈ ప్రోత్సహాకాలతో రైతుల ఆదాయం డబుల్‌ అవుతుందా..? ఆ మాటకొస్తే దేశ జాతీయ స్థూల ఉప్పత్తి వృద్ధి రేటు గత పుష్కరకాలంలో ఎన్నడూ లేనంతగా అయిదు శాతానికి జారిపోయిన ఇలాంటి పరిస్థితుల్లో కర్షకుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారు? వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధిరేటు కేవలం 2.8 శాతానికి పరిమితం అయినప్పుడు రెట్టింపు ఎలా సాధ్యమవుతుంది? మన సగానికి సగం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకున్నారు.. వారికి మరో విద్య తెలియదు.. ఏటా నష్టాలొస్తున్నా రైతు మాత్రం నాగలిపట్టడం మానుకోవడం లేదు.. ఆ భూమినే నమ్ముకుని బతుకున్నాడే తప్ప అమ్ముకుని పట్నానికి పారిపోవడం లేదు.. ఇలా అంతమంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నప్పటికీ జీడీపీలో వ్యవసాయం వాటా 18 శాతానికి మించి లేదు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రైతుల ఆదాయం రెట్టింపు అవ్వడం అంత ఈజీ కాదనిపిస్తోంది…

బీజేపీ ప్రభుత్వంలో రైతులు పెద్దగా లాభపడిందేమీ లేదు… దేశంలో చాలా చోట్ల రైతులు ఉద్యమాలు చేశారు.. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదంటూ రొడ్డెక్కారు.. భారీ ప్రదర్శనలు చేశారు.. మహా పాదయాత్రలు చేశారు.. కోపంతోనో.. నిరసనతోనో పండించిన పంటను రోడ్లమీద పారపోశారు.. తమిళనాడుకు చెందిన రైతులు ఢిల్లీలో కనబర్చిన ఆగ్రహాన్ని మనం చూశాం… ఇదంతా బీజేపీ పాలక పెద్దలు చూశారు కాబట్టే గత బడ్జెట్‌లో రైతుల కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది… పైసా ఖర్చు లేకుండా ప్రకృతిబద్ధంగా వ్యవసాయం చేసే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఆసారి కూడా నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. చెప్పడం వరకే కానీ.. అందుకు తగిన చర్యలు తీసుకోలేదు… నరేంద్రమోదీ ప్రభుత్వం డీబీటీ పథకం కింద రైతులకు హెక్టార్‌కు అయిదువేల రూపాయల చొప్పున నేరుగా నగదు బదిలీ చేస్తోంది… అలాగే లాస్టియర్‌ నుంచి అయిదు ఎకరాలు మించని రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదు ఇస్తోంది… ఆ తర్వాత భూమి పరిమితిని ఎత్తేసింది.. దీనివల్ల లాభపడింది భూమి ఉన్న రైతులే తప్ప కౌలుదారులు కాదు.. పదెకరాలలోపు వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువ మంది కౌలుదారులే.. అసలు కౌలుదారులు ఎవరో.. భూ యజమానులు ఎవరో తెలుసుకునే మెథడాలజీ మన దగ్గర లేదు.. ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయడం లేదు.. పాపం వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతున్నది వారే..! ఆత్మహత్యలకు పాల్పడుతున్నది కూడా వారే! రాజ్యాంగపరంగా చూస్తే వ్యవసాయం ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశమే! అందుకే రైతులకు సంబంధించిన ఏ పథకం అయినా సక్రమంగా అమలు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి… పరస్పరం సహకారం అందించుకోవాలి…ఒకవేళ కేంద్రం ఏదైనా పథకం ప్రవేశపెడితే ముందుగానే రాష్ట్రాలకు మార్గదర్శకాలను చెప్పాలి… అప్పుడు కానీ రైతుల జీవితాలు బాగుపడవు.. రైతుల ఆదాయం రెట్టింపు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. ప్రభుత్వాలకు కూడా ఆ తపన ఉండే ఉంటుంది.. కాకపోతే చిత్తశుద్ధి కరువవుతోంది… ఎప్పుడైనా రైతులకు గిట్టుబాటు ధర అందుతుందా లేదా అన్నది ప్రభుత్వాలు పట్టించుకున్నాయా? వ్యవసాయ మార్కెట్లను పెంచాలి… శీతల గిడ్డంగి కేంద్రాలను విస్తరింపచేయాలి… ఇప్పటికీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలోనే ఉన్నాయి.. దీనివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు.. అందుకే మోదీ సర్కారు జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ను తీసుకొచ్చింది.. రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలను ఎన్‌ఏఎంలో విలీనం చేయాలని ఆదేశించింది…కాని అది జరగలేదు.. ఏవో కొన్ని కమిటీలు మాత్రమే కేంద్ర కమిటీలో విలీనమయ్యాయి… రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులు సకాలంలో అందేట్టు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే… ఇక్కడే వారి అలసత్వం తెలిసిపోతుంది.. అసలు నగదు బదిలీ చేయడం వల్ల రైతులు లాభపడుతున్నారా లేదా అన్నది కూడా పసిగట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు.. నగదు బదిలీ వల్ల తమకు ఎలాంటి లాభమూ లేదని.. ఇంటి అవసరాలకు ఆ డబ్బును వాడుకుంటున్నామని .. విత్తనాలకు.. ఎరువులకు మళ్లీ అప్పులు చేస్తున్నామని… ఆ పథకాన్ని రద్దుచేయమని సాక్షాత్తూ రైతులే చెప్పారు.. కిందటి ఏడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయగలరు? ఏమో … నిర్మలా సీతారామన్‌గారే చెప్పాలి..! -బాలు