Bombay High Court: మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఎన్నో రకాల కఠినమైన చట్టాలను అమల్లోకి కూడా తెచ్చాయి. అయితే ఆ చట్టాలను పరిరక్షించాల్సిన కోర్టులే వాటిని అపహాస్యం చేసేలా వ్యాఖ్యానాలు చేస్తే పరిస్థితి ఏంటి?.. మహిళల రక్షణకు భరోసా ఇవ్వాల్సిన న్యాయస్థానాలే విచిత్ర వాదనలు తెరపైకి తీసుకువస్తే ఏం చేయాలి?. తాజాగా బాలికలపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రంలోని ముంబై నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని శరీర భాగాలపై చేయి వేశాడంటూ బాంబే హైకోర్టులో బాధిత బాలిక తరఫున పిటిషన్ దాఖలైంది. దీనికి ముందు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు.. సదరు వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సదరు వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయలేదు. దాంతో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ కేసును విచారించిన జస్టిస్ పుష్ప విరేంద్ర గనేడివాల ధర్మాసనం.. ”లైంగిక వేధింపులంటే నిందితుడు బాలికపై అత్యాచార యత్నం చేసి ఉండాలి. లేదా ఉద్దేశపూర్వకంగానైనా బాలిక ప్రైవేటు భాగాలను తాకడం, శారీరకంగా వేధింపులకు గురి చేసి ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే నిందితుడిపై ఫోక్సో చట్టం ప్రయోగించడం జరుగుతంది. ఈ కేసులో అలాంటి ఘటనలేవీ నిరూపణ కావడం లేదు. నిందితుడు కేవలం బాలికను డ్రెస్‌పై నుంచి మాత్రమే స్పృషించినట్లు తెలుస్తోంది. లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రయత్నం కూడా చేయలేదు. శరీరం, శరీరం తాకినంత మాత్రాని వ్యక్తులను ఫోక్సో చట్టం కింద శిక్షించలేం. ఆ ఘటనను మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, మహిళలను అవమాన పరచడం కింద భావించి ఐపీసీ 354, 342 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారించవచ్చు. ఒక వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటే పక్కా ఆధారాలు ఉండాలి. కానీ ఈ కేసులో బాలిక ఆరోపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.” అంటూ వ్యాఖ్యానించారు.
అయితే ముంబై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు ఈ తీర్పును ఖండిస్తున్నారు. న్యాయస్థానాలే ఇలా అంటే మహిళలకు రక్షణ ఎక్కడుంటుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సినీనటి తాప్సి పన్ను, సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీర్పును వ్యతిరేకిస్తూ ఆమేరకు ట్వీట్లు చేశారు. మహిళలు ఎదుర్కొనే ఈ చట్టం అద్భుతంగా ఉంది కదా? అంటూ వ్యాఖ్యానించారు.
Also read:
సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..