దివంగత ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మనవరాలు.. బొలంగీర్ జిల్లా రాజ కుటుంబం కోడలు, యువరాణి అద్రిజా రోడ్డెక్కారు. రాజప్రసాదంలో తనకు ఎదురైన అవమానాలు, ఛీత్కారాలను బయట పెట్టారు. గృహ హింస ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్‌లో ఉంటున్నారు. ఇంతకీ ఆమెను ఎదుర్కొన్న అవమానాలు ఎలాంటివి.. రాజభవనంలో ఆమె పడిన కష్టాలేంటి.. రక్షించాల్సిన భర్తే ఆమెను హింసించాడా అసలు ఏం జరిగింది. యువరాణి ఏమంటోంది.
యువరాణి అంటే రాజ ప్రసాదంలో హంగూ ఆర్భాటం ఒక రేంజ్‌లో ఉంటాయని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో చూశాం కాబట్టి.. కానీ, ఆమె కూడా సినిమా కష్టాలు పడిందంటే నమ్మగలరా. సగటు కోడలికి జరిగిన అవమానాలు, ఛీత్కారాలు జరిగాయంటే ఊహించగలమా. అంత పెద్ద రాజభవనంలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఎంత గొంతు చించుకున్నా నాలుగు గోడలు దాటి బయటికి వినిపించదు. అరిచి అరిచి ఆర్తనాదాలు చేసి చేసి అలసిపోయిందేమో. అరుపులు వినే నాథుడు అంత పెద్ద భవనంలో లేరనుకుంది. నేరుగా పోలీసులను ఆశ్రయించింది.
ఒడిషా రాష్ట్రంలోని బొలంగీర్ జిల్లా రాజ వంశీకుల కుటుంబ కలహాలు వీధికెక్కాయి. ఈ కుటుంబంలో యువరాజు అర్కేష్ నారాయణ సింఘ్‌దేవ్ దంపతుల వివాదం రాజభవనం దాటి పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. అర్కేష్‌కు వ్యతిరేకంగా ఆయన భార్య అద్రిజా గృహహింస ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను అర్కేష్ సింఘ్‌దేవ్ ఖండించాడు. ఇది చాలా పాత కేసు.. ఆర్నెళ్ల క్రితం ఫైలైంది.. అప్పుడే తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానని అర్కేష్ చెబుతున్నాడు. ఆమె గృహహింస కేసు పెట్టడంతోనే తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానంటున్నాడు అర్కేష్. ప్రస్తుతం, ఆమె సోదరి అక్కడ నివసిస్తున్నారు. ఆమె తండ్రి కూడా ప్రతినెలా 15 రోజులు రాజ భవానాన్ని సందర్శించేవారని యువరాజు వర్షన్.
రాజభవనం తమదే అయినా.. తానే నెలకోసారి ఇంటికెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నానంటున్నాడు యువరాజు అర్కేష్. పోలీసుల సలహా మేరకు ఆమెతో పాటు, తన భద్రతకు సంబంధించి.. ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయించాడు. అయితే వాటిని అద్రిజా ధ్వంసం చేసిందని, దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు పంపించానని అర్కేష్ వివరించాడు. మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి తమ దగ్గరికి వచ్చి చేసిన డిమాండ్ కూడా తనకు చాలా బాధ కలిగించినట్లు అర్కేష్ నారాయణ సింఘ్ దేవ్ చెప్పాడు.
అయితే యువరాజు దంపతుల వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడొద్దని ఎంత ప్రాధేయపడినా.. తనపై ఒత్తిడి తెస్తున్నారని యువరాజు అర్కేష్ అంటున్నాడు. సహరాపూర్‌లోని కొందరు ల్యాండ్ మాఫియాతో తన మామకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు అర్కేష్. తన ఇంటిపైకి దౌర్జన్యంగా 10మంది వ్యక్తులను పంపించారని, ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించగా.. అవసరమైతే 100 మందితో వస్తానని వార్నింగ్ ఇచ్చారట.
అర్కేష్ సింఘ్‌దేవ్ భార్య అద్రిజా భర్తతో పాటు మామ అనంగ ఉదయసింఘ్ దేవ్, బావ కళికేష్ నారాయణ్ సింఘ్‌దేవ్, అత్త విజయ లక్ష్మీదేవి, మేఘనా రాణా లపై 2022 సెప్టెంబర్ 30న రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్తింటి వారు తనను ఇంటి నుంచి బయటకు నెట్టేయాలని, ఒడిశాను సందర్శించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో రాసింది. మెట్టినింటి వారి సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తన గదివైపు కెమెరాలతో తన ప్రతి కదలికపై నిఘా పెట్టారని అద్రిజా ఆరోపిస్తోంది. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఇటీవల ఉత్తరాఖండ్ డీజీపీ సునీల్ బన్సాల్‌ను కలిసింది. ఈ కేసును ప్రస్తుతం డెహ్రాడూన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు అప్పగించారు.
అర్కేష్ సింఘ్‌దేవ్ గతంలో కాంట్రాక్ట్ కిల్లర్‌తో తనను చంపడానికి ప్రయత్నించారని అద్రిజా డెహ్రాడూన్ లోని స్థానిక మీడియాకు వివరించారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసుల వద్దకు వెళ్లి, రక్షణ కోరారు. అర్కేష్, అద్రిజాల 2017 నవంబర్‌లో జరిగింది. ఐదేళ్లకే వికటించింది. అప్పటి నుంచీ వివాదాలు, గొడవలు, కేసులదాకా వెళ్లింది. కళ్లు చెదిరే రాజభవంతుల్లో కూడా ఎన్నో జరుగుతుంటాయి. ఇలా రోడ్డెక్కితే తప్ప ఎవరికీ తెలియవు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..