జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణం రద్దుపట్ల తను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడే సుముఖత వ్యక్తం చేశానని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఆర్టికల్ ని రద్దు చేశారని, ఈ విషయాన్ని కనీసం ఎవరూ ఊహించలేదని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మీ ఓట్లను ‘శివ్-జ్యోతి ఎక్స్ ప్రెస్’ కి వేయాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తన పేరును కలిపి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. 1980 ప్రాంతంలో కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాను , తన తండ్రిని ఇద్దరినీ కలిపి ప్రజలు ‘మోతీ-మాధవ్ ఎక్స్ ప్రెస్’ గా వ్యవహరించేవారని, ఇప్పుడు మీ ముందు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ ఉన్నారని అన్నారు. నవంబరు 3 న మీరు ఈ ‘ఎక్స్ ప్రెస్’ కే ఓట్లు వేయండి అని సింధియా కోరారు. ఈ రాష్ట్రంలో 28 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆ రోజున బైపోల్ జరగనుంది.