Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

General Elections 2024: కూటమి కూర్పులో ప్రధాన పార్టీలు బిజీబిజీ.. వచ్చే నెలరోజుల్లో చోటుచేసుకునేే పరిణామాలు అత్యంత ఆసక్తికరం

రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీని ఈసారైనా ఓడించాలని విపక్షాల కూటమి వ్యూహరచన చేస్తోంది. అధికార బీజేపీ సైతం పాత మిత్రులతో మళ్ళీ సయోధ్యకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

General Elections 2024: కూటమి కూర్పులో ప్రధాన పార్టీలు బిజీబిజీ.. వచ్చే నెలరోజుల్లో చోటుచేసుకునేే పరిణామాలు అత్యంత ఆసక్తికరం
Rahul Gandhi, Nitish Kumar, Mamatha Benarji, Pm Modi , Amit Shah, Jp Nadda
Follow us
Rajesh Sharma

|

Updated on: Jul 07, 2023 | 6:20 PM

General Elections 2024: జాతీయ స్థాయిలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీని ఈసారైనా ఓడించాలని విపక్షాల కూటమి వ్యూహరచన చేస్తోంది. అధికార బీజేపీ సైతం పాత మిత్రులతో మళ్ళీ సయోధ్యకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విపక్షాలను ఒక్కతాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు చాన్నాళ్ళ క్రితమే మొదలైనా ఇటీవల దీనికి ఒక రూపు వస్తున్న సంకేతాలు బలపడ్డాయి. తొలుత బెంగాల్ దీదీ మమతా బెనర్జీ.. ఆ తర్వాత తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు విపక్షాల ఐక్యత దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేయాలనుకున్నారు. మరొకరు కాంగ్రెస్ పార్టీ కూటమిలో వున్నా అన్ని పార్టీల్లాగే సాధారణ స్థాయిలో వుండాలి కానీ.. పెద్దన్న పాత్ర కోసం తాపత్రయ వద్దనుకున్నారు. కారణాలేవైతేనేం వీరి ప్రయత్నాలు సఫలం కాలేదు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి, జెడీయు అధ్యక్షుడు నితీశ్ కుమార్ కొత్త కూటమి కూర్పు బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. 17 పార్టీలను విజయవంతంగా పాట్నా భేటీలో ఒకే వేదికపై కూర్చొబెట్టగలిగారు. పాట్నా భేటీ పూర్తిగా నితీశ్ కుమార్ ప్లాన్‌లో భాగంగానే జరిగింది. అయితే, ఈ భేటీ వేదికను సిమ్లాకు మార్చాలని, తేదీలను కూడా తామే ఫైనలైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. కానీ తేదీలను మార్చగలిగారు కానీ, వేదికను మార్చలేకపోయారు. పాట్నా భేటీ జరిగిన రోజే విపక్ష కూటమిలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం లేదని తేలిపోయింది. ఢిల్లీ ఆర్డినెన్సు ఉపసంహరణకు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి సహకారం లభించలేదు. కాంగ్రెస్ నేతలు ఎటూ తేల్చకపోవడంతో కేజ్రీవాల్ ఆగ్రహానికి గురయ్యారు. పాట్నా భేటీ ముగింపులో విపక్ష నేతలు మీడియా ముందుకు వచ్చినా అరవింద్ కేజ్రీవాల్ దానికి హాజరుకాకుండా ఢిల్లీకి వెళ్ళిపోయారు. కేజ్రీవాల్ ప్రతిపాదనపై కాంగ్రెస్ నాయకులు ఎటూ తేల్చకపోవడానికి ఇంకో కారణం కూడా కనిపిస్తోంది. పాట్నా భేటీ కంటే ముందే కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో సంఝౌతా కోసం ఓ ప్రతిపాదన పెట్టారు. తమ పార్టీ అధికారంలో వున్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోతే.. తాము మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పోటీకి దిగబోమని ప్రతిపాదించారు. కానీ ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలలో తమని చావుదెబ్బ కొట్టిన ఆప్ ప్రతిపాదనపై కాంగ్రెస్ సహజంగానే సానుకూలంగా స్పందించలేదు సరికదా.. దానికి ప్రతీకారంగా ఢిల్లీ ఆర్డినెన్సుపై కేజ్రీవాల్ అభ్యర్థనను అస్సలు పట్టించుకోలేదు. దాంతో కేజ్రీవాల్ సంయుక్త మీడియా సమావేశానికి హాజరు కాలేదు. అంతే కాదు పాట్నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత విపక్ష కూటమి విషయంలో కేజ్రీవాల్ మాట్లాడం మానేశారు. ఈక్రమంలో ఆయన విపక్ష కూటమి తదుపరి భేటీ (జులై 17, 18 తేదీలలో బెంగళూరులో)కి హాజరవుతారా లేదా ఆసక్తిరేపుతోంది. ఇక విపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఫేస్ ఆఫ్ ది టీమ్‌గా వున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలలో 80 శాతం ఆయనకు కట్ కొట్టి అజిత్ పవార్ సారథ్యంలోనే తమకు భవిష్యత్ వుందంటూ వెళ్ళిపోయారు. ఈక్రమంలో వీకైన ఓ వర్గం నేతగా శరద్ పవార్ బెంగళూరు భేటీకి వస్తారా ? ఒకవేళ వచ్చినా ఆయనకు ప్రాధాన్యత గతంలో లాగా వుంటుందా అన్నదింకా క్యూరియాసిటీ రేపుతోంది.

త్వరలో ఎన్డీయేకు కొత్త రూపు

ఇక అధికార బీజేపీ కూడా చాన్నాళ్ళ తర్వాత నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్‌కు కొత్త రూపునిచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జులై 18న పాత మిత్రులతో, కొత్తగా కలుపుకోవాలనుకుంటున్న పార్టీల నేతలతో సమావేశం నిర్వహించేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దమవుతోంది. జులై ఆరో తేదీన సుమారు 5 గంటల పాటు సమావేశమైన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్డీయే కూర్పుపై సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. ప్రస్తుతం ఎన్డీయేలో వున్న పార్టీలతోపాటు గతంలో కూటమిని వీడిన వారికి కూడా ఆహ్వానం పంపబోతున్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయేని వీడిన శిరోమణి అకాళీదళ్ నేతలకు ఆహ్వానం పంపారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీని కూడా కలుపుకునే యత్నాలు చేస్తున్నారు. అదేసమయంలో ఆల్ రెడీ బీజేపీతో స్నేహంగా వున్న జనసేన పార్టీని పిలుస్తున్నారు. అయితే ఏపీ విషయానికి వస్తే తెలుగు దేశం పార్టీ ఎన్డీయేలో చేరేందుకు ఉత్సుకతతో వుంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్ళి.. అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమై వచ్చినప్పట్నించి ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కొంటాయన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం భిన్నంగా ప్రకటనలు చేశారు. అయితే తాజాగా ఎన్డీయేను బలోపేతం చేయాలని బీజేపీ నిర్ణయించిన దరిమిలా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం వస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటికైతే టీడీపీకి ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇక్కడ ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ విషయంలో ఎవరితో కలవాలనే విషయంలో బీజేపీ అధినాయకత్వం ఇంకా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే పక్షాలతో తప్పనిసరిగా ప్రీపోల్ అలయెన్సెస్.. అంటే ఎన్నికలకు ముందే మిత్ర బంధం వుండాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దాంతో ఏపీలో టీడీపీ-జనసేనలతో కల్వడమా లేక ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న అధికార వైసీపీతో జత కట్టడమా అన్నదిపుడు బీజేపీ ముందున్న సవాలుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీయేలో చేరాల్సిందిగా అమిత్ షా కోరినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా అంశాల వారీగా మద్దతిస్తున్నట్టుగానే ఇకపై కూడా కొనసాగుతానని జగన్ కమలనాథులకు తేల్చిచెప్పారని తెలుస్తోంది. ఈక్రమంలోనే జగన్ మోహన్ రెడ్డిని నయానా భయానా ఎన్డీయేలో చేర్చుకునే ఎత్తుగడలను బీజేపీ హైకమాండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్డీయేను బలోపేతం చేయడంతోపాటు లోక్‌సభ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందుగా నిర్వహించేలా చేసుకోవాలని, మినీ జమిలి ఎన్నికలతో బీజేపీకి ప్రయోజనమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కూటమి కూర్పుల్లో ఓవైపు కమలనాథులు.. ఇంకోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాయి. దాంతో వచ్చే నెల రోజుల పరిణామాలపై ఉత్సుకత ఏర్పడుతోంది.