ఢిల్లీలోని కోట్లా రోడ్‌లో నిర్మించిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం కొత్త భవనాన్ని బుధవారం (15 జనవరి 2025)నాడు ప్రారంభించారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. దీంతో 24, అక్బర్ రోడ్‌లో దాదాపు 5 దశాబ్ధాలుగా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం కొత్త చిరునామాకు మారింది. నూతన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ఇందిరా భవన్‌గా నామకరణం చేయడంపై బీజేపీ స్పందించింది. ధివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటూ కొత్త భవనం బయట పోస్టర్లు కూడా వెలిశాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్‌గా నామకరణం చేయాలంటూ ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు.
గతంలో పార్టీ దిగ్గజ నేతలు బీఆర్ అంబేద్కర్, పీవీ నరసింహరావు, ప్రణబ్ ముఖర్జీలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా విమర్శించారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్‌ను కూడా ఆ పార్టీ చిన్నచూపు చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ‘ఫ్యామిలీ ఫస్ట్’ మైండ్‌సెట్‌ను వీడటం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట రాజకీయ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయ భవంతికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలన్న డిమాండ్ బలంగా ఉన్నా.. దాన్ని విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు లేదని.. సిక్కు సమాజం మొత్తాన్ని ఆ పార్టీ అవమానించిందని ఆరోపించారు.
ఢిల్లీలో ప్రారంభించిన ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయ భవనం
The new Congress Party headquarters, named Indira Bhawan, will be inaugurated tomorrow.
Located at 9A Kotla Road, this will be the new address of the Congress headquarters. pic.twitter.com/awKYm0TXpA
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) January 14, 2025
కాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ఇందిరా భవన్ పేరును పార్టీ నేతలందరూ ఆమోదించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ నుంచి కూడా ఇందిరా భవన్ పేరుకు అభ్యంతరం వ్యక్తంకాలేదని చెప్పారు. కాంగ్రెస్ కొత్త భవనానికి ఇందిరా గాంధీ పేరు పెట్టాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని.. 10 ఏళ్లకు ముందే తీసుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సల్ తెలిపారు. ఇప్పుడు దీనిపై వివాదం చేయడం సరికాదన్నారు.