బాలింత కడుపులో కత్తెరలు మర్చిపోయిన లేడీ డాక్టర్‌.. ఏడాదిన్నర తర్వాత తీసే క్రమంలో మహిళ మృతి

బిడ్డకు జన్మనిచ్చేందుకు పురిటి నొప్పులతో వచ్చిన ఓ పేదింటి మహిళకు లేడీ డాక్టర్ సిజేరియన్ చేసింది. అయితే సదరు డాక్టర్‌ నిర్లక్ష్యంతో కడుపులో ఓ జత కత్తెరలు పెట్టి కుట్లువేసింది. ఈ విషయం తెలియక ఆమె దాదాపు ఒకటిన్నర ఏడాది పాటు కడుపులో కత్తెరతో ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. తరచూ కడపునొప్పి వస్తుండటంతో CTస్కాన్‌ చేయించడగా ఆమె కడుపులో కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు. దీనిని తొలగించేందుకు ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో మృత్యువాత పడింది. ఈ దారుణ ఘటన బీహార్‌లోని మోతీహరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బాలింత కడుపులో కత్తెరలు మర్చిపోయిన లేడీ డాక్టర్‌.. ఏడాదిన్నర తర్వాత తీసే క్రమంలో మహిళ మృతి
Woman Carries Scissor In Stomach For One Year

Updated on: Jan 03, 2026 | 11:32 AM

మోతిహారీ, జనవరి 3: బీహార్‌కు చెందిన మణిభూషణ్ కుమార్ భార్య ఉషా దేవి (25) ఓ క్లినిక్‌లో సిజేరియన్ ప్రక్రియ తర్వాత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. డాక్టర్ సంగీత కుమారి సిజేరియన్ నిర్వహించింది. అయితే ఉషా దేవి కడుపులో ఓ జత కత్తెరలను వదిలివేసి కుట్లు వేసింది. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన ఉషా దేవికి కొన్ని రోజుల తర్వాత కడుపు నొప్పి రావడం మొదలైంది. వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. కానీ అందులో ఏమీ వెల్లడికాలేదు. దీంతో ఆమెకు కొన్ని నొప్పి నివారణ మందులు ఇచ్చి పంపించారు. కొంత ఉపశమనం కలిగించినా మళ్లీ కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో ఉషా దేవి అనేక సార్లు అల్ట్రాసౌండ్లు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో అసాధారణంగా ఏమీ వెల్లడికాలేదు. దీంతో డాక్టర్లు ఆమె ఆరోగ్యంగానే ఉందని, నొప్పిని తగ్గించడానికి మందులు ఇస్తూవచ్చారు. ఇలా దాదాపు ఏడాదిన్నర సంవత్సరం గడిచిపోయింది.

అయితే ఇటీవల ఆమెకు కడుపు నొప్పి భరించలేనంతగా రావడంతో కుటుంబ సభ్యులు ఈసారి ఉషా దేవిని పట్టణంలోని డాక్టర్ కమలేష్ కుమార్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. డాక్టర్ కుమార్ అక్కడ CT స్కాన్ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) చేయగా.. ఆమె కడుపులో ఓ కత్తెర ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే డాక్టర్ కుమార్ ఉషా దేవిని రహమానియా మెడికల్ సెంటర్‌కు తరలించమని కుటుంబ సభ్యులకు సూచించారు. అక్కడ వైద్యులు కత్తెరను తొలగించడానికి శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ ఆ ప్రక్రియ ముగిసే సమయానికి ఉషా దేవి ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే బాధితురాలి కడుపులో పేగులను కత్తెర చీల్చివేసింది. అది ఇన్ఫెక్షన్‌కు కారణమైంది. గతంలో నిర్లక్ష్యంగా సీజేరియన్‌ చేసిన డాక్టర్ సంగీతపై ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇది ముమ్మాటికి డాక్టర్ నిర్లక్ష్యమేనని, ఆపరేషన్ సమయంలో కత్తెర ఎలా మరచిపోతుందని ప్రశ్నించారు. మేము ఏడాదిన్నర పాటు అల్ట్రాసౌండ్లు చేయించుకుంటూనే ఉన్నాం. కానీ ఎవరూ మాకు ఏమీ చెప్పలేదు. ఈరోజు ఒకటిన్నర వయసున్న చిన్నారి తన తల్లిని కోల్పోయింది. దోషులైన వైద్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాడు.

మేము పేదవాళ్ళం, కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాం. మాకు న్యాయం జరగాలని మణిభూషణ్ అన్నారు. ఉషా దేవి కుటుంబం, ఇతర రోగులు సిజేరియన్ చేసిన డాక్టర్‌పై హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేయడంతో జిత్నా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఉషా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించింది. జిట్నా పోలీస్ స్టేషన్ SHO రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. నివేదికలో నిర్లక్ష్యం ఉన్నట్లు ఆధారాలు లభ్యమైతే నిందితులపై FIR నమోదు చేస్తామని ఆయన అన్నారు. సిజేరియన్ చేసిన క్లినిక్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.