సినిమా సీన్ తరహాలో దొంగల్ని పట్టుకున్న బీజేపీ ఎంపీ.. కారుతో ఛేజ్ చేసిన మరీ
సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఆమె మెడలోని బంగారాన్ని ముగ్గురు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ ఈ ఘటనను చూశారు.
ఓ ఎంపీ తనకు తాను నిజమైన ప్రజాప్రతినిధి అని నిరూపించుకున్నారు. మహిళ మెడలోని బంగారాన్ని చైన్ స్నాచర్లు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. సినిమాల్లో దొంగలను కారులో వెంబడించి పట్టుకున్న పోలీసులు మాదిరిగానే.. ఈ ఎంపీ కూడా తన కారులోనే దొంగలను వెంబడించి చివరకు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఔరంగాబాద్ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ కారులో దొంగలను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కారులో సుశీల్ కుమార్ సింగ్ ప్రయాణిస్తుండగా ఓ మహిళ మెడలోని బంగారాన్ని చైన్ స్నాచర్లు లాక్కొని పారిపోయారు. ఇది గమనించిన ఎంపీ.. దొంగలను వెంబడించాలని కారు డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ వెంటనే దొంగలను వెంబడించాడు. మధుపూర్ అనే గ్రామానికి చేరుకోగానే..దొంగ బైక్ బురదలో కూరుకుపోయి కింద పడింది. ఎంపీ కారు వెనుక నుంచి వెంబడించడం చూసి దొంగలు లేచి పొలాల వైపు వేగంగా పరుగులు తీశారు. వెంటనే వెంబడించి దొంగలను పట్టుకోవాలని ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దీంతో అంగరక్షకులు అరకిలోమీటర్ మేర వెంబడించి ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకరి నుంచి తుపాకీతో పాటు లైవ్ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న ఎంపీని పలువురు అభినందిస్తున్నారు. ఎంపీ అంటే ప్రజలకు సహాయం చేయడమేనని, సుశీల్ కుమార్ సింగ్ ఆ పని చేశారన్నారు. ఓ దశలో ఎంపీ ప్రయాణిస్తున్న కారు దొంగల దగ్గరికి రాగానే ఓ వ్యక్తి తుపాకీ తీసి ఎంపీని చంపేస్తానని బెదిరించాడు. అయితే ఎంపీ భయపడవద్దని, దొంగలను వెంబడించాలని సిబ్బందికి సూచించారు.
చోరీకి గురైన బంగారాన్ని తిరిగి ఇచ్చేయడంతో సదరు మహిళ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపింది. సిరీస్ గ్రామానికి చెందిన సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఆమె మెడలోని బంగారాన్ని ముగ్గురు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ ఘటనను చూశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..