లాలూ యాదవ్ సంచలన నిర్ణయం.. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ను పార్టీ తోపాటు, కుటుంబం నుండి బహిష్కరణ!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాలూ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కొడుకు తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించారు. అంతేకాదు తన కుటుంబం నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు లాలూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

లాలూ యాదవ్ సంచలన నిర్ణయం.. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ను పార్టీ తోపాటు, కుటుంబం నుండి బహిష్కరణ!
Lalu Yadav

Updated on: May 25, 2025 | 3:53 PM

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుండి 6 సంవత్సరాలు బహిష్కరించారు. అంతేకాదు, తేజ్ ప్రతాప్‌ను కుటుంబం నుండి కూడా బహిష్కరించారు. ఈ మేరకు ఆర్జేడీ చీఫ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ఈ మేరకు ఆయన సమాచారాన్ని ఇచ్చారు. అందులో తేజ్ ప్రతాప్‌కు ఇప్పుడు కుటుంబంలో, పార్టీలో ఎటువంటి పాత్ర లేదని ఆయన స్పష్టంగా చెప్పారు.

‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుంది’ అని ఆర్జేడీ చీఫ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెద్ద కొడుకు కార్యకలాపాలు, ప్రజా వ్యతిరేక ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పరిస్థితుల కారణంగా, అతన్ని పార్టీ నుండి, కుటుంబం నుండి దూరం చేస్తున్నాను. ఇక నుంచి అతనికి పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదు. అతన్ని పార్టీ నుండి 6 సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్లు లాలూ యాదవ్ ప్రకటించారు.

తన వ్యక్తిగత జీవితంలోని మంచి చెడులను, తాను స్వయంగా చూడగలనని అన్నారు. అతనితో సంబంధాలు ఉన్న ఎవరైనా తమ స్వంత విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజా జీవితంలో ప్రజా అవమానాన్ని ఎప్పుడూ సమర్థిస్తాను. కుటుంబ విధేయులైన సభ్యులు ప్రజా జీవితంలో ఈ ఆలోచనను స్వీకరించి అనుసరించాలని లాలూ యాదవ్ స్పష్టం చేశారు..

నిజానికి, తేజ్ ప్రతాప్ శనివారం ( మే 25) తన సంబంధాన్ని ప్రకటించాడు. గత 12 సంవత్సరాలుగా తాను ఒక వ్యక్తితో సంబంధంలో ఉన్నానని సోషల్ మీడియాలో చెప్పాడు. దీంతో పాటు, అతను తన స్నేహితురాలి చిత్రాన్ని కూడా పంచుకున్నాడు. అతను తన పోస్ట్‌లో ఇలా అన్నాడు, ‘నేను చాలా కాలంగా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా నా హృదయ భావాలను మీ అందరితో పంచుకుంటున్నాను! నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వార్త బీహార్‌లో పెద్ద దుమారం రేగింది.

దీంతో వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తేజ్ ప్రతాప్. మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత, తేజ్ ప్రతాప్ తన పోస్ట్‌ను స్పష్టం చేస్తూ, ‘నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను హ్యాక్ చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను వేధించడానికి, పరువు తీయడానికి నా ఫోటోలను తప్పుగా మార్ఫింగ్ చేశారు’ అని పేర్కొన్నాడు. శ్రేయోభిలాషులు, అనుచరులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి పుకార్లను పట్టించుకోవద్దని తేజ్ ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఇవాళ ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించడం సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..