CM Nitish Kumar: ఆప్‌కు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం.. నితీష్‌ రాయబారంతో కాంగ్రెస్ వైఖరిలో మార్పు

|

May 22, 2023 | 9:13 PM

ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఖర్గే , రాహుల్‌తో బీహార్‌ సీఎం నితీష్‌ భేటీ తరువాత ఆప్‌ విషయంలో కాంగ్రెస్‌ వైఖరి మారింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తున్న నితీష్‌ కాంగ్రెస్‌ , ఆప్‌ మధ్య రాయబారం నడిపారు.

CM Nitish Kumar: ఆప్‌కు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం.. నితీష్‌ రాయబారంతో కాంగ్రెస్ వైఖరిలో మార్పు
Nitish Kumar Kharge Meet
Follow us on

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా అన్ని పావులు కదుపుతున్నారు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌. తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే , రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు నితీష్‌. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ నేతలతో చర్చించారు నితీష్‌. నితీష్‌తో రాహుల్‌,ఖర్గే భేటీ తరువాత ఆమ్‌ ఆద్మీ పార్టీ విషయంలో కాంగ్రెస్‌ వైఖరి అనూహ్యంగా మారింది. ఢిల్లీలో పాలనాధికారాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సమర్ధించాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే అధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని కూడా కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆర్డినెన్స్‌ విషయంలో ఆప్‌కు కాంగ్రెస్‌ మద్దతును సాధించడంలో కీలకపాత్ర పోషించారు నితీష్‌.

వాస్తవానికి ఆప్‌-కాంగ్రెస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఢిల్లీలో పాలనాధికారాలపై ఆర్డినెన్స్‌ను ఢిల్లీ పీసీసీ నేతలు సమర్ధించగా .. కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం తప్పుపట్టింది. కాని నితీష్‌ రాయబారంతో ఆప్‌ విషయంలో కాంగ్రెస్‌ వైఖరి మారింది. బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమన్నారు నితీష్‌. కేజ్రీవాల్‌ కూడా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో అన్ని పార్టీల మద్దతు కోరుతామన్నారు. నితీష్‌తో సమావేశం తరువాత విపక్షాల ఐక్యతకు గట్టి పునాది ఏర్పడిందని ట్వీట్‌ చేశారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే. త్వరలోనే ఢిల్లీలో విపక్షాల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి దేశం లోని చాలామంది ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరువుతారని అన్నారు. విపక్షాల ఐక్యత దేశ ఐక్యతకు దోహదం చేస్తుందన్నారు ఖర్గే.

రెండు మూడు రోజుల్లో విపక్షాలు సమావేశమయ్యే తేదీని ఖరారు చేస్తారు. తనకు ప్రధాని పదవిపై మోజు లేదని , 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు నితీష్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం