Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో పీఎం మోడీ ఆదివారం రాత్రి అహ్మదాబాద్ కూడా చేరుకున్నారు. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పటేల్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గాంధీనగర్‌లోని కొత్త సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా పటేల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈ రోజు భూపేంద్ర పటేల్‌తో సహా కొత్త మంత్రివర్గం ప్రమాణం చేయనుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. 24 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. ఇందులో 11 మంది ఎమ్మెల్యేలను కేబినెట్ స్థాయి అవకాశం కల్పించనున్నారు. అయితే భూపేంద్ర పటేల్ 2.0 ప్రభుత్వంలో బీజేపీ అధిష్టానం పెద్ద నేతలకు షాక్ ఇచ్చింది. జితు వాఘాని, కిరీట్ సింగ్ రాణా, పూర్ణేష్ మోడీ, మనీషా వకీల్, నిమిషా సుతార్, విను మోర్దియా, నరేష్ పటేల్, జితు చౌదరి, శంకర్ చౌదరి, రామన్ వోరా, అల్పేష్ ఠాకోర్, శంభునాథ్ తుండియా, జయేష్ రాడ్డియా సహా పలువురిని మంత్రి వర్గం నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ రూపానీ అనంతరం.. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును బీజేపీ అధిష్టానం 2021 సెప్టెంబర్ 12న ప్రకటించింది. గుజరాత్ చరిత్రలో మొదటిసారిగా.. ముఖ్యమంత్రిని తప్పించింది. పలు సమస్యల కారణంగా విజయ్ రూపానీ ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో జితు వాఘని, కిరీట్ సింగ్ రాణా, పూర్ణేష్ మోడీతో సహా పలువురు మంత్రులను తిరిగి నియమించారు. ఈసారి భూపేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయి సీట్లతో గెలిచి మరో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఈసారి కొన్ని పెద్ద నేతలను తప్పించి.. బీజేపీ మరికొందరికి అవకాశం కల్పించింది.
ప్రమాణస్వీకారం చేసే మంత్రులకు నిన్న టెలిఫోన్ ద్వారా సమాచారం అందించారు. వీరిలో రిషికేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, జగదీష్ పంచల్, కున్వర్జీ బవ్లియా, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్, పరాసోత్తమ్ సోలంకి, భానుబెన్ బాబ్రియా, బచుభాయ్ ఖబద్, ముభైలు బేరా, కుబేర్ దిండోర్, హర్ష్ సంఘ్వీ, ముఖేష్ పటేల్, కుబేర్ దిండోర్, ప్రఫుల్‌జీ పర్‌మార్, ప్రఫుల్‌జీ పర్‌మార్ తదితరులు ఉన్నారు.
సామాన్య కార్యకర్త నుంచి.. సీఎం వరకు..
పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్ పూర్తి పేరు.. భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. 1962 జులై 15న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కడవ పటిదార్ కుటుంబంలో జన్మించారు. అహ్మదాబాద్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో 1982లో డిప్లొమా పూర్తి చేశాడు. అనంతరం బీజేపీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రపటేల్‌కు అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కింది. విజయ్ రూపానీ స్థానంలో గత సెప్టెంబర్‌లో ఆయన సీఎం పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఆయన సీఎం పదవిని చేపట్టారు. 1999 నుంచి 2000 వరకు మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడు పనిచేశారు భూపేంద్రపటేల్. 2008 నుంచి 2010 వరకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్ పనిచేశారు. 2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్‌లోని తల్తేజ్ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా , అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ల ట్రస్టీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2017 ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుండి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, భూపేంద్రపటేల్ మోదీ వీరవిధేయుడని పేరుంది. అమిత్‌షా అండదండలు కూడా పుష్కలంగా ఉండటం ఆయనకు కలిసివచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..