శత వసంతంలోకి ఎల్‌కే అద్వానీ.. పుట్టినరోజు వేళ భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.!

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు. అద్వానీ ఈరోజు 100వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శత వసంతంలోకి ఎల్‌కే అద్వానీ.. పుట్టినరోజు వేళ భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.!
Lk Advani , Pm Modi

Updated on: Nov 08, 2026 | 11:40 AM

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు. అద్వానీ ఈరోజు 100వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 8, 1927న జన్మించిన అద్వానీ ఆదివారం 99 ఏళ్లు పూర్తి చేసుకుని జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని, అద్వానీ రాజకీయ ప్రస్థానాన్ని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు.

అద్వానీతో అనుబంధం.. మోదీ భావోద్వేగం!

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన సందేశాన్ని పంచుకున్న మోదీ.. నవంబర్ 8 తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు. అద్వానీజీ ఆప్యాయత, సాన్నిహిత్యం, మార్గదర్శకత్వం పొందడం తన అదృష్టమని తెలిపారు. ఆయనతో గడిపిన అనేక సందర్భాలు, జ్ఞాపకాలు తన మనసులో మెదులుతున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.

1927 నవంబర్ 8న కరాచీలో జన్మించిన అద్వానీ.. దేశ విభజన సమయంలో 1947లో సింధ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి నిర్మించుకున్నారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. జనసంఘ్‌ను బలోపేతం చేయడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం ఆయన రాజకీయ జీవితంలో గొప్ప మైలురాళ్లని కొనియాడారు.

అద్వానీ, వాజ్‌పేయ్‌ల స్నేహం ప్రత్యేకం..!

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్‌తో అద్వానీకి ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దశాబ్దాల పాటు ఇద్దరు అగ్రనేతలు పరస్పర పోటీ లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయడం భారత రాజకీయాల్లో అరుదైన విషయమని అన్నారు. వీరిద్దరూ కలిసి దేశ రాజకీయాల గమనాన్ని మార్చారని పేర్కొన్నారు. అద్వానీలో రెండు ప్రత్యేక లక్షణాలు తనను ఎప్పుడూ ఆకట్టుకున్నాయని మోదీ తెలిపారు. మొదటిది ఆయన ప్రసంగాలు, రచనల్లో కనిపించే సైద్ధాంతిక స్పష్టత, మేధోపటిమ. రెండోది రాజకీయాల్లో తాను భావించిన బూటకపు లౌకికవాదాన్ని ప్రశ్నించే ధైర్యమని వివరించారు.

ఎమర్జెన్సీ నుంచి రథయాత్ర వరకు..!

1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అద్వానీ పోరాడారని మోదీ గుర్తుచేశారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని కొనియాడారు.

1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ చేపట్టిన రథయాత్రను ఆయన రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టంగా అభివర్ణించారు. ఆ యాత్ర ప్రారంభం నుంచి అమలు వరకు తనకూ భాగస్వామ్యం కలిగిందని మోదీ గుర్తుచేసుకున్నారు. బీహార్‌లో అద్వానీ అరెస్టు కావడం, ఆ తర్వాత రామమందిరం అంశంపై బీజేపీ తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రస్తావించారు.

2024లో భారతరత్న..

అద్వానీ నిరాడంబరత, పుస్తక పఠనంపై ఆసక్తి, సినిమా, నాటకాలపై అభిరుచిని కూడా ప్రధాని మోదీ తన వ్యాసంలో ప్రస్తావించారు. ఆయన రచించిన ‘మై కంట్రీ, మై లైఫ్’ పుస్తకం ఆయన చరిత్రపై ఉన్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు. అద్వానీ సతీమణి కమలా అద్వానీ తన ప్రజా జీవితమంతా ఆయనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు.

2024లో భారత ప్రభుత్వం ఎల్.కే. అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది. ప్రస్తుతం ఆయన 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంచి ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు దేశ ప్రజలకు స్ఫూర్తినివ్వాలని మోదీ ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us