Bharat Ratna for LK Advani: బీజేపీ దిగ్గజ నేత అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలు ఇవే..!

ప్రధాని మోదీకి అద్వానీ రాజకీయ గురువు. ఈ ఇద్దరికి దశాబ్దల గురుశిష్యుల అనుబంధం ఉంది. అద్వానీ రథయాత్ర చేపట్టినపుడు మోదీ వెంట నడిచారు. అద్వానీ శిష్యుడిగా బీజేపీలో ఒక్కోమెట్టూ ఎదిగారు మోదీ. అద్వానీ ఆశీస్సులతోనే మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారన్న ప్రచారం ఉంది. కానీ మోదీ, తన గురువును మించిన శిష్యుడిగా ఎదిగారు.

Bharat Ratna for LK Advani: బీజేపీ దిగ్గజ నేత అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలు ఇవే..!
Lal Krishna Advani And Narendra Modi

Updated on: Feb 03, 2024 | 7:04 PM

బీజేపీ కురువృద్ధుడు, మాజీ డిప్యూటీ ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారైన భారతరత్న వరించింది. LK అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా శనివారంనాడు వెల్లడించారు. మనం చూస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు అద్వానీ అంటూ కొనియాడిన ప్రధాని మోదీ.. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు.

ప్రధాని మోదీకి అద్వానీ రాజకీయ గురువు. ఈ ఇద్దరికి దశాబ్దల గురుశిష్యుల అనుబంధం ఉంది. అద్వానీ రథయాత్ర చేపట్టినపుడు మోదీ వెంట నడిచారు. అద్వానీ శిష్యుడిగా బీజేపీలో ఒక్కోమెట్టూ ఎదిగారు మోదీ. అద్వానీ ఆశీస్సులతోనే మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారన్న ప్రచారం ఉంది. కానీ మోదీ, తన గురువును మించిన శిష్యుడిగా ఎదిగారు. మోదీ కారణంగానే అద్వానీ దేశ ప్రధాని కాలేకపోయారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడం ఆసక్తిగా మారింది.

LK Advani, Narendra Modi (File Photo)

దేశ విభజనకు ముందు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలోని కరాచీలో 1927 నవంబరు 08న అద్వానీ జన్మించారు. జాతీయ పార్టీకి బీజేపీ నిర్మాణంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ ఆవిర్భావం మొదలుకుని ఆ పార్టీకి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 1986 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980 -1990 మధ్య కాలంలో బీజేపీని బలమైన జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో అద్వానీ సఫలీకృతమయ్యారు. 1984లో కేవలం 2 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. 1989లో 86 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. 1992లో 121 స్థానాలు, 1996లో 161 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దేశ స్వాతంత్ర చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నాటి ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన ఉద్యమం బీజేపీ నిర్మాణానికి ఎంతో దోహదపడింది.

1999 నుంచి 2004 మధ్య కాలంలో నాటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో అద్వానా కేంద్ర హోం మంత్రిగా.. ఆ తర్వాత డిప్యూటీ ప్రధానిగా సేవలందించారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు అద్వానీ పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు.

అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలు

1927 నవంబర్ 8న పాకిస్తాన్‌ని కరాచిలో అద్వానీ జననం

1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరిన అద్వానీ

1951లో భారతీయ జనసంఘ్‌లో చేరిన లాల్‌కృష్ణ అద్వానీ

1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మెన్ గా ఎన్నిక

1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక

1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం

1977 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా అద్వానీ

1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అద్వానీ

1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర

1998 వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన అద్వానీ

2002 ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి లాల్‌కృష్ణ అద్వానీ

2004 లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైనా అద్వానీ

2007లో ప్రధానమంత్రి అభ్యర్థిగా అద్వానీ పేరును సూచించిన పార్టీ

2008 “మై కంట్రీ, మై లైఫ్” పేరుతో స్వీయచరిత్రను విడుదల

2024 అద్వానీకి భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన