
అత్తింటి వారి వరకట్న వేధింపులు భరించలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల పూజశ్రీ అనే మహిళకు మూడేళ్ల క్రితం నందీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో భర్త అదనపు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే నందీప్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత నుంచే ఇంట్లో వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయని వారు చెప్పుకొచ్చారు.
అదనపు కట్నం డిమాండ్ చేయడమే కాకుండా సందీప్ రోజూ భార్యతో గొడవలు పడేవాడని ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేకనే పూజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని వారు పేర్కొన్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.